కరోనా నుంచి కోవిషీల్డ్ రక్షణ ‘‘మూడు’’ నెలలే..  బ్రిటన్ శాస్త్రవేత్తల సంచలన నివేదిక

  • IndiaGlitz, [Wednesday,December 22 2021]

దక్షిణాఫ్రికాలో పుట్టిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఒక్కొక్క దేశంలో ఈ మహమ్మారి అడుగుపెడుతూ శాస్త్రవేత్తకు సవాల్ విసురుతోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, బ్రిటన్, అమెరికాలో ఒమిక్రాన్ తీవ్రత అధికంగా వుంది. దీని నుంచి ఎలా బయటపడాలో.. కట్టడి ఎలాగో తెలియక ఆయా దేశాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. అటు ప్రస్తుతం వున్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌ను సరిగా అడ్డుకోలేవంటూ విస్త్రతంగా కథనాలు వెలువడుతున్నాయి. కానీ తయారీ సంస్థలు మాత్రం ఈ వాదనను అంగీకరించడం లేదు.

తాజాగా ఆక్స్‌ఫర్డ్‌– ఆస్ట్రాజెన్‌కా సంయుక్తంగా రూపొందించిన కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత మూడు నెలలకు అది కల్పించే రక్షణ తగ్గుతోందని లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. బ్రెజిల్, స్కాట్‌లాండ్‌లలో సర్వేల ఆధారంగా ఈ విషయాన్ని తేల్చినట్లు ఎడిన్‌బరో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని ఇచ్చిన వారికి బూస్టర్‌ డోసులివ్వడం ద్వారా రక్షణ పెంచాలని వారు సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాలను గ్లాస్గో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కటికిరెడ్డి శ్రీనివాస విఠల్ వెల్లడించారు. తమ పరిశోధన బూస్టర్‌ డోసుల ప్రాముఖ్యాన్ని వివరిస్తోందని ఆయన చెప్పారు. ప్రజలకు వ్యాక్సిన్ రక్షణ తగ్గుతోందని తెలియగానే భారత ప్రభుత్వం బూస్టర్‌ డోసులివ్వడం ఆరంభించాలి విఠల్ సూచించారు.

ఇకపోతే ఈ టీకాను భారత్‌లో పూణే కేంద్రంగా పనిచేస్తోన్న సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ‘‘కోవిషీల్డ్‌’’ పేరిట తయారు చేసిన సంగతి తెలిసిందే. మనదేశంలో అత్యధిక శాతం మంది దీనిని వ్యాక్సిన్‌గా తీసుకున్నారు.