తెలంగాణలో జనవరి 3 నుంచి పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్.. 2007 ముందు పుడితేనే, రిజిస్ట్రేషన్ ఇలా..!!
Send us your feedback to audioarticles@vaarta.com
జనవరి 3వ తేదీ నుంచి తెలంగాణలో పిల్లలకు కొవిడ్ టీకాలు వేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. 15-18 సంవత్సరాల మధ్య ఉన్న వారికి టీకా వేస్తామని.. వీరంతా కొవిన్ పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్, పురపాలికల్లో కొవిన్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. పీహెచ్‌సీలు, వైద్య కళాశాలల్లో టీకాలు వేస్తామని హరీశ్ రావు తెలిపారు. 2007 కంటే ముందు పుట్టిన పిల్లలకు మాత్రమే వ్యాక్సిన్ వేస్తామని మంత్రి వివరించారు.
అర్హులైన పిల్లలందరికీ కొవాగ్జిన్ టీకా వేస్తామని, కొవాగ్జిన్ టీకాను కేంద్రమే సూచించిందని హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 15-18 సంవత్సరాల పిల్లలు 22.78 లక్షల మంది ఉన్నారని, 61 సంవత్సరాలు దాటిన వారు 41.60లక్షల మంది ఉన్నారని మంత్రి చెప్పారు. అలాగే పాత్రికేయులకు బూస్టర్ డోస్ ఇస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.
తెలంగాణలో తొలి డోసు వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయిందని మంత్రి తెలిపారు. వంద శాతం లక్ష్యం పూర్తి చేసుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని, వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషి వల్లే లక్ష్యం పూర్తి చేయగలిగామని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్‌పై మొదటి నుంచి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించి.. స్వయంగా కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారని హరీశ్ రావు తెలిపారు.
ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేశారని.. పంచాయతీరాజ్, మున్సిపల్‌శాఖలు వ్యాక్సినేషన్లో భాగస్వామ్యమయ్యాయని చెప్పారు. టీకాపై ప్రజల్లో ఉండే అనుమానాలు, అపోహలు నివృత్తి చేశామని హరీశ్ రావు గుర్తుచేశారు. రాష్ట్రంలో 7,970 వ్యాక్సినేషన్ కేంద్రాలు పనిచేస్తున్నాయని.. కరోనా విపత్కర పరిస్ధితుల్లో వ్యాక్సిన్ సంజీవనిగా నిలిచిందని చెప్పారు. తెలంగాణలో ఇంకా రెండు విడతల్లో 5.55 కోట్ల డోసులు ఇవ్వాల్సి వుందని మంత్రి వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments