విరించితో పాటు మరో 4 ఆసుపత్రుల కొవిడ్ చికిత్స లైసెన్స్ రద్దు

విరించి హాస్పిటల్‌ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వంశీకృష్ణ అనే వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా లక్షల్లో ఫీజు వేయడంతో అంత ఫీజు ఎలా అయ్యింది? తన అన్నకు అందించిన చికిత్సను సైతం వైద్యురాలైన మృతుడి సోదరి మీడియా ఎదుటే వైద్యులను కడిగి పారేసింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీంతో విరించి హాస్పిటల్ కొవిడ్ ట్రీట్‌మెంట్ లైసెన్సును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే సదరు విరించి ఆసుపత్రికి కొవిడ్ చికిత్స లైసెన్సును రద్దు చేయడం కొత్తేమీ కాదు. గ‌తేడాది క‌రోనా సంక్షోభంలోనూ రూల్స్ పాటించనందుకు గానూ విరించి ఆస్ప‌త్రి కొవిడ్ చికిత్స లైసెన్స్ ర‌ద్దు అయింది.

ఇదీ చదవండి: ఉల్లిపాయ, ఫ్రిడ్జ్ బ్లాక్ ఫంగస్‌కు కారణమవుతాయా?

ఇక కరోనా బాధితుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తున్న ఇతర ప్రైవేటు ఆస్ప‌త్రుల‌పై సైతం తెలంగాణ ప్ర‌భుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం 60 ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అధిక బిల్లులు వసూలు చేసిన, నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌లోని ఐదు ఆస్పత్రుల కోవిడ్ చికిత్స లైసెన్స్‌ను ఆరోగ్య శాఖ రద్దు చేసింది. కొవిడ్ చికిత్స లైసెన్స్ రద్దైన వాటిలో బంజారాహిల్స్ రోడ్డ నెంబర్ 1లోని విరించి ఆస్పత్రితో పాటు.. బేగంపేటలోని విన్‌ ఆస్పత్రి, కాచిగూడలోని టీఎక్స్‌ ఆస్పత్రి, కేపీహెచ్‌బీలోని మ్యాక్స్‌ హెల్త్‌, సనత్‌నగర్‌లోని నీలిమ ఆస్పత్రులు ఉన్నాయి.

అధిక ఫీజులు వ‌సూళ్లు చేస్తున్నార‌ని ప్ర‌జ‌ల నుంచి అందిన ఫిర్యాదుల మేర‌కు ఈ చర్యలు తీసుకున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో మరో 60 ఆస్పత్రులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీచేసింది. నోటీసులపై సంబంధిత ఆస్పత్రులు స్పందించకుంటే.. వాటికి కూడా కొవిడ్ చికిత్స లైసెన్స్ ర‌ద్దు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, బంజారాహిల్స్‌లోని విరంచి ఆస్పత్రిపై నల్గొండ జిల్లాకు చెందిన బాధితుడు వంశీ కృష్ణ అనే వ్యక్తి కుటుంబం‌ ఇచ్చిన ఫిర్యాదు అధారంగా ప్రభుత్వం ఆస్పత్రిపై చర్యలు తీసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వంశీకృష్ణ మృతి చెందినట్టు సోదరి, ఇతర కుటుంబ సభ్యులు ఆస్పత్రి సిబ్బందితో గొడవకు దిగిన సంగతి తెలిసిందే.