తగ్గుముఖం పట్టిన సెకండ్ వేవ్?
- IndiaGlitz, [Saturday,May 22 2021]
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఒక్కసారిగా ఏ రేంజ్‌లో విజృంభించిందో తెలియనిది కాదు. నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవడంతో ఈ పరిస్థితుల నుంచి బయటపడతామా.. లేదా? అనే భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మూడు నెలలుగా విజృంభించిన సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే కాస్త దారిలోకి వస్తోంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో కరోనా కట్టడికి చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు, మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూలు, ఇతర ఆంక్షలతో మొత్తానికి కరోనా కట్టడికి తీవ్రమైన కృషి చేస్తున్నాయి. దీంతో కొవిడ్ వ్యాప్తి నెమ్మదించినట్టే కనిపిస్తోంది.
కరోనా తీవ్రతను చాటే పాజిటివ్ రేటు పతనం, యాక్టివ్ కేసుల సంఖ్యను చూస్తుంటే.. కరోనా నెమ్మదించినట్టు కనిపిస్తోంది. మూడు రోజుల నుంచి 20 లక్షలపైగా పరీక్షలు చేస్తున్నా.. కేసులు 3 లక్షల లోపే ఉండటం దీనికి బలం చేకూరుస్తోంది. గత వారం వరకు పాజిటివ్ రేటు తగ్గిన జిల్లాలు దేశంలో 210 ఉండగా.. ఇప్పుడది 303కు పెరిగింది. ఆసుపత్రుల్లో చేరికలను మించి డిశ్చార్జిలు ఉన్నాయి. ఇక మహారాష్ట్రలో నెలన్నర క్రితం దాదాపు 30 ఉన్న పాజిటివ్ రేటు తాజాగా 10.6కు తగ్గింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, కేరళ, కర్ణాటక, గోవా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు అమలవుతున్నాయి.
కాగా.. వరుసగా 6వ రోజు సైతం దేశంలో 3 లక్షలకు దిగువన రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య నమోదైంది. పాజిటివ్ కేసులు తగ్గినా... కరోనా మరణాల సంఖ్య ఆగడం లేదు. గడిచిన 24 గంటలలో 2,57,299 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటలలో దేశంలో కరోనాతో మొత్తం 4194 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 3,57,630 మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,62,89,290కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 29,23,400 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 87.25 శాతంగా ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 11.63 శాతంగా ఉంది.