కోవిడ్‌పై పోరు.. ఇవాళ్టీ నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో భారతదేశం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి, 15 నుంచి 18 ఏళ్ల లోపు యువతకు టీకాలు వేసింది కేంద్రం. ఈ క్రమంలో 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు వారికి ఈ రోజు నుంచి టీకా వేసేందుకు కేంద్రం రెడీ అయ్యింది. హైదరాబాద్‌కు చెందిన ‘‘బయోలాజికల్ ఈ’’ సంస్థ రూపొందించిన కొర్బివ్యాక్స్ అనే టీకాతో 12 – 14 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సిన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. అలాగే 60 ఏళ్లు పై బడిన వారికి కూడా నేటి నుంచి బూస్టర్ డోస్‌ను సైతం ఇవ్వనున్నారు. 12 నుంచి 14 ఏళ్ల బాలబాలికలకు కొర్బివ్యాక్స్ టీకాను 0.5 ఎంఎల్ ను ఒక్క డోసుగా ఇవ్వనున్నారు. రెండవ డోజు కోసం 28 రోజుల వ్యవధి ఉండాలని కేంద్రం సూచించింది. అలాగే టీకా తీసుకున్న తర్వాత.. పిల్లలను దాదాపు గంట పాటు వైద్యులను పరిశీలనలోనే ఉంచాలని పేర్కొంది.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. దేశ ప్రజల సహకారం వల్లే ఈ టీకా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. అర్హులైన భారతీయులందరికీ టీకా ఇచ్చేందుకు చేస్తోన్న ప్రయత్నాల్లో ఈ రోజు ముఖ్యమైందని ప్రధాని అభివర్ణించారు. ఇవాళ్టీ నుంచి.. 12 నుంచి 14 ఏళ్ల వయస్సువారు టీకా తీసుకునేందుకు అర్హులుగా మారారని మోడీ తెలిపారు. అలాగే ఈ రోజు నుంచి 60 ఏళ్లు పైబడిన అందిరికీ ప్రికాషనరీ డోసు ఇస్తున్నామని ప్రధాని చెప్పారు. ఈ వయస్సువారంతా టీకా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మిగిలిన దేశాల్లో టీకా పట్ల అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. మన దగ్గర ప్రజలు టీకా తీసుకోవడమే కాకుండా, ఇతరులు టీకా తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారని మోడీ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments