ఏపీలో నేటి నుంచే అమల్లోకి నైట్ కర్ఫ్యూ.. వారికి మాత్రం మినహాయింపు
- IndiaGlitz, [Tuesday,January 18 2022]
కరోనా కేసులు మరోసారి పెరుగుతుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు మరోసారి ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల నైట్ కర్ఫ్యూతో పాటు థియేటర్‌లలో 50 శాతం ఆక్యూపెన్సీ వంటివి అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా ఇవాళ్టీ నుంచి ఆంక్షలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధిస్తూ గత వారం ఉత్తర్వులు వెలువరించింది. అయితే సంక్రాంతి పండుగ కావడంతో కొద్దిరోజులు ఈ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ క్రమంలో నేటి (జనవరి 18) నుంచి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈ నెల 31 వరకూ ఈ నిబంధనలు అమలులో ఉండనున్నాయి. ప్రతిరోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 వరకు కర్ఫ్యూ అమలు కానుంది. దీనితో పాటు ప్రజలందరూ తప్పని సరిగా మాస్క్‌లు ధరించాలి. అలాగే వివాహాది శుభకార్యాలు, ఇతర బహిరంగ కార్యక్రమాలకు గరిష్టంగా 200 మంది, ఇన్‌డోర్‌లో 100 మందిని మాత్రమే అనుమతించనున్నారు.
సినిమా హాళ్లు, హోటళ్లు ,రెస్టారెంట్లలో భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. ప్రజారవాణాకు సంబంధించి సిబ్బందితో పాటు, ప్రయాణికులూ మాస్క్‌లు ఖచ్చితంగా ధరించాలి. మార్కెట్లు, షాపింగ్ మాల్స్ , దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, మతపరమైన ప్రదేశాలలో ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం–2005 లోని నిబంధనలు, ఐపీసీ సెక్షన్ 188 కింద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఆస్పత్రులు, మెడికల్ ల్యాబ్‌లు, ఫార్మసీ రంగాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్ సర్వీసులు, ఐటీ సంబంధిత సేవలు, పెట్రోల్ బంకులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్య సిబ్బందికి మాత్రం నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది