కరోనా ఎఫెక్ట్ : నేటి నుంచి షిరిడీ ఆలయం మూసివేత
- IndiaGlitz, [Tuesday,March 17 2020]
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా యావత్ భారతదేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఓ వైపు రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో ప్రజలు జంకుతున్నారు. అయితే.. దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతుండటంతో సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో భక్తుల తాకిడి అధికంగా ఉండే శిరిడీ ఆలయాన్ని మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే.. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆలయాన్ని తెరవబోరని ఆలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అంతేకాదు.. బాబా భక్తులు ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని అధికారులు చెప్పారు. జనాల తాకిడి అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. దేశం మొత్తమ్మీద 125 కరోనా కేసులు నమోదు కాగా మహారాష్ట్రలోనే దీని తీవ్రత ఎక్కువ ఉందన్న సంగతి తెలిసిందే.