చీటింగ్ కేసులో హీరో సూర్య బంధువు.. నిర్మాత జ్ఞాన‌వేల్‌కు కోర్టు స‌మ‌న్లు

  • IndiaGlitz, [Friday,July 24 2020]

తమిళ నిర్మాత జ్ఞాన‌వేల్ రాజాకు మ‌నీ లాండ‌రింగ్ కేసుకు సంబంధించి రామ‌నాథ పురం పోలీస్ స్టేస‌న్‌లో హాజ‌రై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. వివ‌రాల్లోకెళ్తే.. నిర్మాత జ్ఞాన‌వేల్ రాజా హీరో సూర్య‌కు క‌జిన్ వ‌రుస అవుతాడు. సూర్య హీరోగా న‌టించిన సినిమాల‌తో పాటు ఇత‌ర త‌మిళ సినిమాల‌ను కూడా తెలుగులోకి అనువదించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడిగా మారారు. ఈయ‌న సినిమాల‌కు రామ‌నాథ‌పురంలోని మ‌ణి అండ్ గ్యాంగ్ ఫైనాన్స్ చేస్తుంటుంది. ఈ కంపెనీలో జ్ఞాన‌వేల్‌కు భాగ‌స్వామ్యం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తుంటాయి. అయితే ఈ స‌ద‌రు ఫైనాన్స్ కంపెనీ దాదాపు చిట్స్ పేరిట రూ.300 కోట్ల మేర‌కు ఖాతాదారుల‌కు టోపీ పెట్ట‌డానికి ప్ర‌య‌త్నించింద‌ని రామనాథ‌పురం పోలీస్ స్టేష‌న్‌లో కేసు వేశారు.

దీనికి సంబంధించిన రామ‌నాథ‌పురం పోలీసుటు జ్ఞాన‌వేల్‌రాజాను వివ‌ర‌ణ కోర‌గా.. త‌న‌కు మ‌ణి అండ్ గ్యాంగ్‌కు మ‌ధ్య సినిమా ఫైనాన్స్ వ్య‌వ‌హారాలు మాత్ర‌మే ఉన్నాయ‌ని తెలియజేశారు. అంతే కాకుండా ప్ర‌స్తుతం ఉన్న క‌రోనా ప‌రిస్థితుల్లో వీడియో కాల్ ద్వారా పోలీసుల‌కు వివ‌ర‌ణ ఇస్తాన‌ని కోర్టును ఆశ్ర‌యించారు. అయితే కోర్టు ఆగ‌స్ట్ 7న నేరుగా రామ‌నాథ పురం పోలీస్ స్టేస‌న్‌లో హాజ‌రై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టు స‌మ‌న్లు జారీ చేసింది.