మాల్యాకు షాకిచ్చిన హైకోర్ట్.. ఈ దెబ్బతో..!
- IndiaGlitz, [Tuesday,April 09 2019]
బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టు కోలుకోలేని షాకిచ్చింది. భారత్‌కు అప్పగించాలన్న వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు తీర్పును సమర్థించింది. దీంతో కంగుతిన్న మాల్యా ఈ తీర్పును సవాల్ చేసేందుకు అనుమతినివ్వాలంటూ కోర్టును అభ్యర్థించారు. అయితే కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది.
ఈ క్రమంలోనే భారతీయ దర్యాప్తు సంస్థలు వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన వెస్ట్‌మినిస్టర్ కోర్టు.. భారతీయ కోర్టుల్లో జరుగుతున్న విచారణకు హాజరయ్యేలా మాల్యాను భారత్‌కు అప్పగించాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఈ ఫిబ్రవరిలో బ్రిటన్ హోం శాఖ కార్యదర్శి సాజిద్ జావిద్.. ఈ తీర్పును ధ్రువీకరిస్తూ మాల్యాను భారత్‌కు అప్పగించాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలోనే మాల్యా హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ చుక్కెదురైంది. దిగువ కోర్టు తీర్పును మాల్యా సవాల్ చేయడానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విలియం డేవిస్ నిరాకరించారు. అయితే శుక్రవారంలోగా పునరుద్ధరణ దరఖాస్తు చేస్తే న్యాయమూర్తి ఎదుటకు తీసుకెళ్తామన్నారు. అయితే అక్కడ మాల్యా తరఫు న్యాయవాదులు, భారత్ తరఫున వాదిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) మధ్య స్వల్ప వాదోపవాదాలు ఉంటాయని స్పష్టం చేశారు.
దీని ఆధారంగా పూర్తి విచారణ జరుపాలా?.. వద్దా? అన్నదానిపై న్యాయమూర్తి నిర్ధారిస్తారని చెప్పారు. ఒకవేళ అక్కడ కూడా తిరస్కారం ఎదురైతే మాల్యా అప్పగింతను ఆపగలిగే శక్తి ఏదీ ఉండదని ఆయన తేల్చిచెప్పారు. దీంతో మాల్యా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.