Bhola Shankar:మెగా అభిమానులకు ఊరట.. భోళా శంకర్‌కు లైన్ క్లియర్, రేపు గ్రాండ్ రిలీజ్ , ఇక రచ్చ షురూ

  • IndiaGlitz, [Friday,August 11 2023]

మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘‘భోళా శంకర్’’ రిలీజ్‌పై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. సినిమా విడుదలకు అనుమతినిస్తూ సిటీ సివిల్ కోర్ట్ తీర్పు వెలువరించింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తనకు రూ.30 కోట్లు చెల్లించాలంటూ గాయత్రి ఫిల్మ్స్ అధినేత , వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ కోర్టును ఆశ్రయించారు. దీనిపై నిన్న , ఈరోజు న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సినిమా విడుదలకు అడ్డు చెప్పలేమని చెబుతూ సతీష్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో రేపు భోళాశంకర్ యథాతథంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. భోళాశంకర్ విడుదల సందర్భంగా చిరంజీవికి సార్‌కి, మిత్రుడు మెహర్ రమేశ్‌కి, నా ఫేవరేట్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకరకు బెస్ట్ విషెస్ అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే :

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ మూవీ ఏప్రిల్ 27న థియేటర్‌లలోకి వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడింది. నిర్మాతల, డిస్ట్రిబ్యూటర్, బయ్యర్లు అందరికీ కోట్లాది రూపాయల మేర నష్టం వచ్చింది. ఈ క్రమంలోనే తనను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేతలు రూ.30 కోట్ల మేర మోసం చేశారంటూ విశాఖకు చెందిన డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

మూడు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ ఇస్తామని :

ఏజెంట్ మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేతలు అనిల్ సుంకర, గరికపాటి కృష్ణకిశోర్‌లు తనను మోసం చేశారని.. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలని సతీష్ ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రాలకు తనతో పాటు గాయత్రి ఫిల్మ్స్‌కు ఇస్తామని అగ్రిమెంట్ ఇచ్చారని.. ఇందుకోసం రూ.30 కోట్లు తీసుకుని తనను మోసం చేశారని సతీష్ ఆరోపించారు. దీనికి సంబంధించిన మొత్తం ఆధారాలు తన వద్ద వున్నాయని చెప్పారు. ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కేవలం విశాఖ జిల్లా వరకే ఇచ్చి.. అగ్రిమెంట్ బ్రేక్ చేశారని సతీష్ పేర్కొన్నారు. దీనిపై మే 1న హైదరాబాద్ వెళ్లి నిర్మాత కృష్ణ కిషొర్‌ను కలిశానని.. ఆయన అనిల్ సుంకరతో మాట్లాడారని తెలిపారు. ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయిందని చెప్పి.. అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామని చెప్పారని, దీనిని నమ్మిన తాను డబ్బులు వస్తాయని భావించి విశాఖ తిరిగొచ్చేశానని పేర్కొన్నారు. ‘‘సామజవరగమన’’ సినిమా విశాఖ హక్కులు తనకు ఇచ్చారని.. కానీ కొద్దిపాటి మొత్తంలోనే డబ్బు రికవరీ అయ్యిందని సతీశ్ చెప్పారు.

ఎంతోమందికి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బాకీ వుంది :

దీనిని మరోసారి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లగా.. 45 రోజుల్లోగా సెటిల్ చేస్తామని హామీ ఇచ్చారని, లేని పక్షంలో తమ సంస్థ నుంచి మరో సినిమా విడుదలయ్యే 15 రోజుల ముందు చెల్లిస్తామని అగ్రిమెంట్ ఇచ్చారని సతీశ్ తెలిపారు. దీని ప్రకారం .. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నెక్ట్స్ సినిమా ‘‘భోళా శంకర్’’. దీనిపై వాళ్లతో మాట్లాడదామని ప్రయత్నిస్తే.. స్పందించడం లేదని.. ఛాంబర్ పెద్దలకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని సతీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే కోర్టుకు వెళ్లానని ఆయన స్పష్టం చేశారు. డబ్బులు ఇవ్వకపోగా.. తన మీద ఫోర్జరీ చేశారనే నింద వేశారని, యూరోస్ ఇంటర్నేషనల్ వారికి వీరు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని సతీశ్ తెలిపారు. తనతో పాటు ఎంతో మందికి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బాకీ వుందని.. అలా వారు తమ గుడ్‌విల్‌ను పొగొట్టుకున్నారని ఆయన మండిపడ్డారు.

చిరంజీవి కోసమే ఇన్నాళ్లు ఆగాను :

విశాఖ డిస్ట్రిబ్యూటర్‌గా చిత్ర పరిశ్రమతో తనకు ఎంతో అనుబంధం వుందని.. రంగస్థలం, వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి వంటి సినిమాలను తాను డిస్ట్రిబ్యూషన్ చేశానని సతీశ్ చెప్పారు. చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన నటించిన సినిమా కావడంతోనే తాను ఇంతకాలం ఆచితూచి వ్యవహరించానని సతీశ్ పేర్కొన్నారు. కానీ ఎప్పుడైతే తన మీద ఫోర్జరీ నింద వేసి.. ఆ వార్తలను గ్రూపులలో తిప్పిస్తూ తనను అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై అన్ని విషయాలను మీడియాకు వివరిస్తానని సతీశ్ పేర్కొన్నారు.