జనసేన టికెట్ల కోసం ఆలుమగలు ఆసక్తి

  • IndiaGlitz, [Sunday,February 17 2019]

జనసేన రోజుకు రోజుకు బలపడుతోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.! ఇందుకు గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలే కారణమని చెప్పుకోవచ్చు. ఇంత వరకూ పుట్టిన ఏ పార్టీలో లేని కమిటీలు ఏర్పాటు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అభ్యర్థుల ఎంపిక చాలా పకడ్బందీగా చేస్తున్నారు. పవన్ నాయకత్వాన్ని మెచ్చిన నాయకులు ఆయన పార్టీలోకి చేరడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌‌లు కూడా జనసేనలో చేరగా త్వరలోనే మరికొందరు చేరతారని.. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ, బీజేపీ అభ్యర్థుల ప్రకటన సమయంలో మరికొంత అసంతృప్తులు పార్టీలో చేరతారని తెలుస్తోంది.

కాగా.. ఇప్పటికే స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభించిన జనసేన అభ్యర్థుల బయోడేటాను స్వీకరిస్తోంది. ఈ ప్రక్రియ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ వందల సంఖ్యలో అభ్యర్థులు అప్లికేషన్లు పెట్టుకోవడం గమనార్హం. ఈ అప్లికేషన్లు బట్టి చూస్తే రోజుకు రోజుకు జనసేన ఏ రేంజ్‌‌కు చేరుతోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కాగా... ఆదివారం ఒక్క రోజే 210 మంది ఆశావ‌హులు స్క్రీనింగ్ క‌మిటీ ముందు హాజర‌య్యారు. ఈ సందర్భంగా లోక్ సభ, శాసన సభ స్థానాలకు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ ఆలుమగలు బయో డేటాలు ఇవ్వడం విశేషం. తమ జంటలో ఒకరికి జనసేన టికెట్ కేటాయించాలంటూ కమిటీ ముందుకు వచ్చారు. ఈ విధంగా ఆదివారంనాడు 8 జంటలు బయో డేటాలు సమర్పించాయి. వివిధ రంగాలకు చెందినవారు, వృత్తి నిపుణులు, ఉన్నత చదువులను అభ్యసించిన యువతీయువకులు తరలివచ్చారు.

ఆడపడుచుల ఆసక్తి..
కుటుంబాన్ని చక్కదిద్దే సమర్థత, నైపుణ్యం ఉన్న ఆడపడుచులు చట్ట సభల్లో ఉండాలని ప్రభావశీలంగా చెప్పడమే కాదు.. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌కు జనసేన అధినేత పవన్ కట్టుబడి ఉన్నారు. ఈ విషయం ఆయన ప్రతి సభలో చెబుతూనే వస్తున్నారు. దీంతో జనసేనలో చేరితే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా అన్ని రకాలు మేలు జరుగుతుందని భావిస్తున్న ఆడపడుచులు పార్టీలో చేరుతున్నారు. మరికొందరు విద్యావంతులు, మహిళా పారిశ్రామికవేత్తలు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల కోసం పోటీపడుతున్నారు. కాగా ఆదివారం ఒక్క రోజే వచ్చిన 210 మందిలో 45 మంది మహిళలు ఉండటం విశేషం.