AP Wine Shops:కౌంటింగ్ అలర్ట్.. ఏపీలో మూడు రోజులు మద్యం షాపులు బంద్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మందుబాబులకు పోలీసులు, ఎన్నికల అధికారులు బ్యాడ్‌న్యూస్ అందించారు. మూడు రోజుల పాటూ మద్యం షాపులు మూతపడనున్నాయి. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు పంపినట్లు తెలిపారు. అలాగే జూన్ 4న కౌంటింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని.. రాష్ట్రవ్యాప్తంగా హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని సూచించారు.
అంతేకాదు సోషల్ మీడియాలో జరిగే ఫేక్ ప్రచారం, వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా జూన్ 4న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ కారణంగానే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మద్యం షాపులను మూసివేస్తున్నారు. కౌంటింగ్ ముందు రోజు నుంచి.. కౌంటింగ్ ముగిసిన మరుసటి రోజు వరకు మద్యం అమ్మకాలను నిషేధించారు. అంతేకాదు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, సంబరాలకు కూడా అనుమతి లేదని, బాణసంచా వంటివి కాల్చడానికి వీల్లేదని పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
కౌంటింగ్ సమయంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నామని.. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు పల్నాడు జిల్లా, అనంతపురం జిల్లా, తిరుపతి జిల్లాల్లో జరిగిన ఘటనలతో ఎన్నికల సంఘం అప్రమత్తం అయ్యింది. ఇప్పటికే సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ చేయిస్తోంది. అలాగే అవసరమైన చోట్ల అదనపు బలగాలను మోహరించింది. అంతేకాదు కౌంటింగ్ రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి అదనపు బలగాలను రాష్ట్రానికి తీసుకొచ్చారు. జూన్ 15 వరకు ప్రత్యేక నిఘా కొనసాగించాలని కేంద్ర ఇంటిలిజెన్స్ అలర్ట్‌తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout