శుభమా అని పెళ్లి చేద్దామంటే.. మళ్లీ క‘రోనా’..

  • IndiaGlitz, [Wednesday,April 21 2021]

అసలే గత ఏడాదంతా కరోనాకే అంకితమై పోయింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో పర్వాలేదనుకున్నా కూడా.. మూఢాలు కొంపముంచాయి. దీంతో 70 రోజుల పాటు పెళ్లిళ్లు.. ఇతర శుభకార్యాలకు బ్రేక్ పడింది. ఆరంభం అంతా కరోనా కేసులు చాలా తక్కువగా నమోదవడంతో ఇకేంముంది మహమ్మారి అంతానికి వచ్చేసింది కదా అని జనమంతా ముహూర్తాలు పెట్టుకుని కల్యాణ మండపాలు, విందు వినోదాలతోపాటు అనేక ఈవెంట్ల నిర్వహణకు లక్షల్లో అడ్వాన్సులు చెల్లించేశారు. ఏప్రిల్‌కి వచ్చేసరికి సీన్ మారిపోయింది. కరోనా గతంలో కంటే దారుణంగా విజృంభిస్తోంది. ఇప్పుడు లక్షల్లో అడ్వాన్సులు చెల్లించిన వారు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

సరిగ్గా గతేడాది మార్చి 3వ వారం నుంచి కరోనా ఎఫెక్ట్‌తో ఆరు నెలలకుపైగా పెళ్లిళ్లకు బ్రేక్‌ పడింది. తరువాత ముహూర్తాలు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. ఇక 2021 జనవరి మూడో వారం నుంచి శుక్రమూఢమి కారణంగా పెళ్లిళ్లు, శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు వంటి వాటికి ముహూర్తాలు లేవు. ఇప్పుడు వైశాఖమాసంలో మే 1వ తేదీ నుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో ముందస్తుగానే వధూవరుల తల్లిదండ్రులు భారీగా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ఈ ఏర్పాట్ల కోసం ఇప్పటికే పెద్ద మొత్తంలో అడ్వాన్స్ చెల్లించి ఉన్నారు. ఇప్పుడు పెళ్లి చేద్దామంటే కరోనా మహమ్మారితో భయం.. ఆపేద్దామంటే లక్షల్లో అడ్వాన్సులు కట్టి ఉన్నారు. అవి తిరిగి వచ్చే పరిస్థితి లేదు. మొత్తానికి ముందు నుయ్యి వెనుక గొయ్యిల తయారైంది పలువురి పరిస్థితి.

గతేడాది కరోనా సమయంలో కూడా కొన్ని పెళ్లిళ్లు జరిగాయి. అయితే బంధుమిత్రుల హడావుడి లేకుండానే ఏదో తూతూ మంత్రంగా ఈ పెళ్లిళ్లన్నీ జరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితి వద్దు.. బంధుమిత్రులందరి సమక్షంలోనే అంగరంగ వైభవంగా తమ పిల్లల పెళ్లి చేయాలని కొందరు నిర్ణయించుకున్నారు. దీంతో పాటు ఈ ఏడాది ఆరంభం కరోనా ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఇక కాలం పూర్తిగా తమకే అనుకూలమనుకున్నారు కానీ కరోనా కొంపముంచేసింది. మూఢాలు ఉన్నంతకాలం మౌనంగా ఉన్న కరోనా ముహూర్తాలు ప్రారంభమయ్యే సమయానికి విజృంభించింది. ఇప్పుడు ఇలా కరోనా విజృంభించడం వధూవరుల తల్లిదండ్రులకే కాదు.. కల్యాణ మండపాల యజమానులతోపాటు వివిధ ఈవెంట్ల మేనేజర్లు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే కరోనా ఆంక్షలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి తామంతా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.