పెళ్లి వేడుకలో 86 మందికి కరోనా.. తెలంగాణలో మళ్లీ విజృంభణ
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఇటీవలి కాలంలో కేసులు గణనీయంగా తగ్గిపోవడంతో జనాలు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ పక్కనబెట్టేశారు. మాస్కుల వాడకం తగ్గిపోయింది. సోషల్ డిస్టెన్స్ మాటే పూర్తిగా మరచిపోయారు. స్కూళ్లు తెరుచుకోవడం కూడా మహమ్మారి విజృంభించడానికి కారణమవుతోంది. ఇక నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్‌లోని ఓ పెళ్లి వేడుకలో కరోనా కలకలం రేపింది. సిద్దాపూర్‌లో ఓ వివాహం వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు బంధువులు కూడా పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు.
కాగా.. ఈ పెళ్లి హాజరైన వారిలో 86 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గ్రామంలో క్యాంప్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సైతం మొన్నటి వరకూ 200 లలోపు నమోదైన కరోనా కేసులు.. ప్రస్తుతం దాదాపు 1500 నమోదవుతున్నాయి. తాజాగా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,321 కొత్త కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా.. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఐదుగురు మృతి చెందారు.
శనివారం నమోదైన కేసులతో కలిపితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 3,12,410కు చేరుకుంది. కరోనాతో మొత్తం 1,717 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 293 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,923 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3886 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలోనూ తిరిగి కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout