Corona:దేశంలో మళ్లీ కరోనా ప్రకంపనలు.. తెలంగాణ ప్రభుత్వం అలర్ట్..
- IndiaGlitz, [Tuesday,December 19 2023]
దేశంలో కరోనా కేసులు(Corona cases) మరోసారి పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. కేరళలో డిసెంబర్ 8న కరోనా కొత్త సజబ్ వేరియంట్ జెఎన్.1 (JN.1) కేసు గుర్తించారు. మరోవైపు ఆదివారం ఒక్కరోజే కొత్తగా 335 కొత్త కరోనా కేసులు నమోదుకాగా.. ఈ వైరస్ కాటుకు ఐదుగురు చనిపోయారు. ఈ ఐదుగురిలో నలుగురు కేరళకు చెందిన వారైతే, ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం దేశంలో 1701 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి దీంతో ప్రస్తుతం అయ్యప్ప స్వాముల సీజన్ కావడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha ) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా సంసిద్ధంగా ఉండాలని సూచించారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలు పరిశుభ్రతను పాటించాలని, మాస్కులు ధరించాలని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, శ్వాసకోస సంబంధిత సమస్య ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. కోవిడ్19(Covid 19) వ్యాధి నిర్ధారణ పరీక్షలకు కావాల్సిన కిట్స్, చికిత్సకు అవసరమైన మందులు ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
అయితే మొన్నటి వరకూ రకరకాల వేరియంట్లు వచ్చినప్పటికీ.. తాజాగా వెలుగులోకి వచ్చిన కోవిడ్ జెఎన్.1 (JN.1) వేరియంట్ పెద్ద ఎత్తున ప్రజలపై ప్రభావం చూపిస్తున్నట్లు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళకు చెందిన 79 ఏళ్ల మహిళలో ఓమిక్రాన్ సబ్-వేరియంట్ బిఏ.2.86తోపాటు జెఎన్.1 అనే కొత్త వేరియంట్ కనుగొన్నారు. దీంతో కరోనా కేసుల పెరుగుదల మళ్లీ ఆందోళనలను కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం ప్రతి రోజు ఈ కేసుల సంఖ్య 2,000 కి చేరుకుంటుందని తెలిపింది. ఈ రకమైన వైరస్ అన్ని దేశాల్లో త్వరగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. చలికాలం కావడంతో పాటు ప్రస్తుతం క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండుగలతో పాటు పెళ్లిళ్ల సీజన్‌లు అయినందున బహిరంగ ప్రదేశాల్లో ప్రజల రద్దీ అధికంగా ఉంటుంది కనుక మాస్క్ ధరించాలని.. కరోనా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇక కరోనా కొత్త సబ్ వేరయంట్ JN.1 లక్షణాలు ఎలా ఉంటాయంటే జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, శ్వాసకోస సంబంధిత సమస్యలు వస్తాయి. నాలుగైదు రోజుల పాటు ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యలు అధికమైతే కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని గొంతు నొప్పి ఉంటే గోరువెచ్చని నీటిని తాగడంతో పాటు సమీపంలోని వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.