తిరుమలలో థర్మల్ గన్ ద్వారా కరోనా పరీక్షలు
- IndiaGlitz, [Friday,March 13 2020]
కరోనా వైరస్ లేదా కోవిడ్-19 పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలంగాణలో సైతం వచ్చేసింది. మరోవైపు ఢిల్లీలో కూడా ఈ వైరస్ ఒకరిద్దరికి సోకినట్లు వైద్యులు నిర్దారణకు వచ్చారు. ఇలాంటి వార్తలు విన్న జనాలు గజ గజ వణికిపోతున్నారు. ఇన్నాళ్లు ఈ వైరస్‌కు దూరంగా ఉన్న భారత్‌కు వచ్చేసింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకడం తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతోంది.
టీటీడీ కీలక నిర్ణయం
అయితే ఇటీవలే నెల్లూరులో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ థర్మల్ గన్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అలిపిరి తనిఖీ కేంద్రం, శ్రీవారి మెట్టు, నడక మార్గాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో అలిపిరి చెక్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాన్ని టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్, ఇతర ఉన్నతాదికారులు పరిశీలించారు. అంతేకాదు.. అనారోగ్యంతో ఉన్న వారు తిరుమలకు రావద్దంటూ టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.
మాస్క్‌లు ధరించండి!
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారు దయచేసి అవి తగ్గిన తరువాతే తిరుమలకు రావాలని టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేసింది. ఆలయంలో పనిచేసే ఉద్యోగులు కూడా మాస్క్‌లు ధరించేలా టీటీడీ అధికారులు సూచనలు చేశారు. ముఖ్యంగా భక్తుల రద్దీ ప్రాంతాల్లో సేవలంధించే ఉద్యోగులు మాస్క్‌లు ధరించేలా ఉద్యోగులకు వారిపై అధికారులు కౌన్సింగ్ ఇస్తున్నారు.