హైదరాబాద్‌లో కరోనా టెస్టుల నిలిపివేత.. కారణం ఏంటంటే..

  • IndiaGlitz, [Thursday,June 25 2020]

తెలంగాణలో కేసులు ఎంత దారుణంగా పెరుగుతున్నాయో.. టెస్టులు అంత తక్కువ స్థాయిలో జరుగుతున్నాయనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 30 వేలకు పైనే టెస్టులు చేస్తుంటే తెలంగాణలో కనీసం 3 వేల టెస్టులకు కూడా దిక్కులేదు. దీనికి తోడు మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ఇప్పటికే టెస్టులు చాలా తక్కువ సంఖ్యలో చేస్తున్నారని విపక్షాలు, ప్రజలు విమర్శిస్తుంటే.. హైదరాబాద్‌లో టెస్టులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

జీహెచ్ఎంసీలో నేడు, రేపు కరోనా టెస్టులు నిలిపివేస్తున్నట్టు వైద్యశాఖాధికారులు ప్రకటించారు. ఇప్పటికే సేకరించిన శాంపిళ్ల పరీక్షల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ల్యాబ్‌ల కెపాసిటీని పెంచాల్సిందిబోయి నేడు, రేపు కరోనా టెస్టులను నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు ఏపీ ఇంటింటా టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమవుతుంటే.. తెలంగాణలో ఈ పరిస్థితేంటని ప్రజానీకం వాపోతోంది.