ఇకపై ఇంట్లోనే కరోనా టెస్ట్.. కిట్ ధర కూడా చాలా తక్కువే..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే ప్రస్తుత తరుణంలో చాలా కష్టమైపోతుంది. గవర్నమెంట్ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోవాలంటే కోడి కంటే ముందే లేవాలి. ఇక ప్రైవేట్ టెస్టింగ్ సెంటర్లో అయితే ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకుంటే రెండు రోజుల తర్వాతే మనకు టెస్టింగ్‌కు అవకాశం వస్తుంది. చచ్చీచడి చేయించుకున్నామా.. రిపోర్ట్ రావడానికి రెండు రోజుల సమయం పడుతుంది. ఈ లోపు రోగి పరిస్థితి మరింత విషమించి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. ఇకపై ఇలాంటి సమస్యలేమీ ఉండవు. ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకోవడానికి వీలుగా హోం టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ కిట్‌తో రెండు నిమిషాల్లో పరీక్ష చేసుకోవచ్చు. పావుగంటలో ఫలితం తెలిసిపోతుంది. దీని ధర కూడా తక్కువే. కేవలం రూ.250.
ఇదీ చదవండి: కృష్ణపట్నం కరోనా మందు.. అసలు కథ ఇదీ..
పుణెకు చెందిన ‘మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్’ రూపొందించిన ఈ కొత్త హోం టెస్ట్ కిట్ పేరు.. కొవిసెల్ఫ్. ప్రభుత్వ కేంద్రాల్లో చేస్తున్న ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ లాంటిదే ఇది. ఐసీఎంఆర్ కూడా దీని వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే వారాంతానికి ఇది దేశవ్యాప్తంగా ఉన్న 7 లక్షల మందుల షాపుల్లో, ఆన్‌లైన్ ఫార్మసీల్లో అందుబాటులోకి వస్తుందని మైల్యాబ్స్ డైరెక్టర్ సుజీత్ జైన్ తెలిపారు. దేశంలోని 90 ప్రదేశాలకు వీలైనంత త్వరగా చేరుకోవాలన్నదే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఈ టెస్టింగ్ కిట్‌లోనే మనం పరీక్ష ఎలా చేసుకోవాలనే దానికి సంబంధించిన మాన్యువల్ ఉంటుంది. దీని ద్వారా ఈ టెస్టును ఇంట్లోనే ఎవరికి వారు చేసుకోవచ్చని.. దీంట్లో పాజిటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ పరీక్ష అక్కర్లేదని తెలిపారు.
కొవిసెల్ఫ్‌తో టెస్టు ఇలా..
కొవిసెల్ఫ్ కిట్‌లో ముందే ఒక ద్రావకాన్ని నింపిన ఎక్స్‌ట్రాక్షన్ ట్యూబ్, స్టెరైల్ చేసిన నేజల్ స్వాబ్, ఒక టెస్ట్ స్ట్రిప్, బయోహజార్డ్ బ్యాగ్ ఉంటాయి. ఈ కిట్‌ను వినియోగించేవారు తొలుత ‘మైల్యాబ్ కొవిసెల్ఫ్’ అనే యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్/యాపిల్ స్టోర్ నుంచి మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్‌లో టెస్టు ఎలా చేసుకోవాలి? ఫలితం తెలుసుకోవడం ఎలా? వంటి విషయాలన్నీ ఉంటాయి. అనంతరం టెస్ట్ కిట్‌ను తెరిచి అందులోని నేజల్ స్వాబ్‌ను ఒకదాని తర్వాత ఒకటిగా ముక్కు రంధ్రాలు రెండింటిలోకి 4-5 సెంటీ మీటర్ల మేర పెట్టి నాలుగైదుసార్లు అటూ ఇటూ తిప్పాలి. దీంతో లోపల ఉన్న శ్లేష్మం స్వాబ్‌కు అంటుకుంటుంది. ఆ స్వాబ్‌ను బయటకు తీసి ముందే ద్రావకం నింపి ఉన్న ట్యూబ్‌లో పెట్టి మూత బిగించాలి. అనంతరం ఆ ట్యూబ్ ద్వారా టెస్ట్‌స్ట్రిప్‌పైకి రెండు చుక్కల ద్రావకాన్ని వెయ్యాలి. టెస్ట్‌స్ట్రిప్‌పై రెండు గీతలుంటాయి. ఒకటి కంట్రోల్ సెక్షన్. రెండోది టెస్ట్ సెక్షన్. స్ట్రిప్‌పై ద్రావకం వేసిన తర్వాత కొద్దిసేపటికి కంట్రోల్ సెక్షన్ గీత మాత్రమే ఎర్రగా అయితే నెగెటివ్‌గా భావించాలి. కంట్రోసెక్షన్‌తోపాటు టెస్ట్ సెక్షన్ గీత కూడా(రెండు గీతలూ) ఎర్రగా వస్తే పాజిటివ్‌గా పరిగణించాలి. సాధారణంగా 5-7 నిమిషాల్లోపే ఫలితం తెలిసిపోతుంది. కొందరిలో 15 నిమిషాలు పడుతుంది. టెస్ట్ పూర్తయ్యాక ఫలితాన్ని మనం కొవిసెల్ఫ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న మొబైల్‌లోనే టెస్ట్ స్ట్రిప్‌ను ఫొటో తీయాలి. అప్పుడా యాప్ పరీక్ష ఫలితాన్ని గ్రహించి ఐసీఎంఆర్ సెంట్రల్ సర్వర్‌కు పంపుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments