తెలంగాణలో కరోనా నియంత్రణలోనే ఉంది: కేటీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా పరిస్థితి నియంత్రణలోనే ఉందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నేడు కరోనా పరిస్థితులపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ కీలక సమావేశం సచివాలయంలో జరిగింది. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, కమిటీ సభ్యులు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాలకు సైతం నేడు హైదరాబాద్ కల్పతరువులా నిలిచిందన్నారు. కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉన్నారని, తెలంగాణలో కేసులు తగ్గుతున్నాయని కేంద్ర మంత్రులే చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
అందరి సహకారంతో కరోనా నుంచి బయటపడేందుకు యత్నిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి బెడ్లు, ఆక్సిజన్, రెమిడేసివిర్ ఇంజక్షన్లు అందుబాటులోనే ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రతి రోజూ ఆస్పత్రిల్లో వాడే ఇక్సిజన్‌పై వివరాలున్నాయని, మితిమీరిన ఇంజక్షన్లు, అనవసర ఆందోళనలు వద్దని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ చికిత్స ఔషధాలకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్న విషయమై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టు కేటీఆర్ వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య అధికారులతో రోజూ మాట్లాడుతున్నారని, రాబోయే రోజుల్లో టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్, రెమిడేసివిర్, ఆక్సిజన్ ఉత్పత్తిపై సమావేశమవుతామని కేటీఆర్ ప్రకటించారు. ఇంటింటి సర్వే, హోం ఐసోలేషన్ కిట్లతో ప్రాణాలను కాపాడే అవకాశం లభించిందన్నారు.
ఆక్సిజన్ సప్లై గురించి కూడా చర్చించామని, ప్రస్తుతానికి అవసరమైన డిమాండ్ సప్లై విషయంలో వివరాలు తీసుకున్నామని, ఆక్సిజన్ ఆడిట్‌ను ప్రభుత్వం చేస్తుందని ప్రకటించారు. రెమ్‌డెసివర్ సరిపడా తెప్పించామన్నారు. ఇంకా మరికొన్ని ఆర్డర్ చేశామన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిని కట్టడి చేస్తున్నామని కేటీఆర్ ప్రకటించారు. ఇష్టానుసారంగా రెమ్‌డెసివిర్ ఇష్టానుసారంగా వాడొద్దని ఆసుపత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. కరోనా వ్యాక్సిన్ విషయమై కూడా ఈ సందర్భంగా చర్చించామని.. రావల్సిన టీకాల కోటా, గ్లోబల్ టెండర్ల విషయమై కూడా చర్చించామని.. దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఎప్పటికప్పుడు కరోనా కట్టడికి చర్యలను ముమ్మరం చేస్తున్నామని, మరింత సమగ్రంగా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తామని మంత్రి ప్రకటించారు. టాస్క్‌ఫోర్స్ సమావేశాలు వరుసగా కొనసాగే ఒక సమగ్ర కార్యాచరణ దిశగా ముందుకు వెళ్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments