బండ్ల గ‌ణేశ్‌కు క‌రోనా పాజిటివ్‌

ప్రపంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప‌లు రంగాలు ఇబ్బందులు ప‌డుతున్నాయి. ముఖ్యంగా సినీ రంగం చాలా ఇబ్బందుల‌ను ఎదుర్కొంటోంది. అయితే కూడా సినీ ప్ర‌ముఖులంద‌రూ సంయ‌మ‌నం పాటిస్తున్నారు. ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచ‌న‌లు చేస్తూ వీడియోలు పంపారు. మెసేజ్‌లు పెట్టారు. ఏదైతేనేం తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌ను కూడా క‌రోనా తాకింది. న‌టుడిగా సినీ రంగ ప్ర‌వేశం చేసి నిర్మాత‌గా మారిన బండ్ల గ‌ణేశ్‌కు క‌రోనా టెస్టుల్లో పాజిటివ్ వ‌చ్చింది. హెయిర్ ప్లానిటేష‌న్‌కు వెళ్లిన బండ్ల గ‌ణేశ్‌కు అక్క‌డి డాక్ట‌ర్ క‌రోనా టెస్ట్ చేయించుకోమ‌ని స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. స‌రేన‌ని! టెస్ట్ చేయించుకోగా బండ్ల గ‌ణేశ్‌కు పాజిటివ్ వ‌చ్చింద‌ట‌.

షాద్ న‌గ‌ర్‌లో ఉండే బండ్ల గ‌ణేశ్‌కు కోళ్ల ప‌రిశ్ర‌మ ఉంది. ఇంటికి కోళ్ల ఫామ్‌కు, ఇత‌ర ప్ర‌దేశాల‌కు వెళ్లి వ‌స్తుండేవాడ‌ట‌. ఆ క్ర‌మంలో ఎక్క‌డో క‌రోనా ఎటాక్ అయ్యింద‌ని అంటున్నారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన వార్త‌ల‌ను తెలుసుకున్న మీడియా ప్ర‌తినిధులు బండ్ల గ‌ణేశ్‌ను సంప్ర‌దించ‌గా.. ఆయ‌న అవున‌నే చెప్పాడ‌ట‌. ప్ర‌స్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాన‌ని, రెండు రోజుల్లో అపోలో లేదా కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌లో జాయిన్ అవుతాన‌ని తెలియ‌జేశారట‌. గ‌ణేశ్‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఆయ‌న కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నార‌ట‌. బండ్ల గ‌ణేశ్‌కు క‌రోనా రావ‌డంతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ అల‌ర్ట్ అయ్యింది.