పుట్టింట్లో మరోమారు కల్లోలం రేపుతున్న కరోనా మహమ్మారి..

  • IndiaGlitz, [Friday,January 08 2021]

కరోనా మహమ్మారి తన పుట్టింట్లో మరోమారు కల్లోలం రేపుతోంది. 2019లో వూహాన్‌లో పుట్టిన ఈ మహమ్మారిని ఆ దేశస్తులు త్వరగానే వదిలించుకున్నారు. ఆ తర్వాత ఇటీవలి కాలం వరకూ ఈ మహమ్మారి జాడ చైనాలో కనిపించలేదు. ఈ మహమ్మారిని వదిలించుకునేందుకు చైనా అధికారులు ఎన్నో కష్టాలు పడ్డారు. భారీగా కరోనా టెస్టింగ్‌లు, లాక్‌డౌన్ ఏం చేస్తేనేమి మొత్తానికి కరోనా మహమ్మారినైతే పారద్రోలారు. తిరిగి ఇన్నాళ్లకు కరోనా జాడలు తిరిగి కనిపించాయి. రాజధాని బీజింగ్‌కు దక్షిణాన ఉండే హెబై ప్రావిన్స్‌లో రెండు సిటీల్లో కరోనా కోరలు చాస్తోంది. హెబై ప్రావిన్స్‌లో తాజాగా 127 సింప్టమాటిక్ కరోనా కేసులు... 183 అసింప్టమాటిక్ కేసులు వెలుగు చూశాయి.

చైనాలో ఇన్ని కేసులు వెలుగు చూడటం 2019 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇన్ని కేసులు ఒక్కసారిగా బయటపడటంతో అప్రమత్తమైన అధికారులు హెబై ప్రావిన్స్‌లోని షిజియాషాంగ్, జింగ్టాయ్ సిటీల్లో లాక్‌డౌన్ విధించారు. అక్కడి ప్రజలకు అధికారులు పలు ఆంక్షలు విధించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశించారు. అలాగే హెబై ప్రావిన్స్ నుంచి బీజింగ్‌కు వెళ్లే వాహనాలపై కూడా ఆంక్షలు విధించారు. కాగా.. విదేశాల నుంచి తిరిగొచ్చిన వ్యక్తులతో పాటు ఇతర దేశాల నుంచి దిగుమతి అయిన ఆహార పదార్థాల కారణంగానే మరోమారు కరోనా కల్లోలం రేపుతోందని అధికారులు చెబుతున్నారు.