కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. కేసులు తగ్గిపోతున్నాయ్!
- IndiaGlitz, [Tuesday,May 12 2020]
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ కోలుకుంటోంది. ఇందుకు నిదర్శనమే గత నాలుగైదు రోజులుగా నమోదవుతున్న కేసులు. గత రెండు వారాలుగా 10వేలకు పైగా టెస్ట్‌లు చేసినప్పటికీ 70,80 కేసులు నమోదయ్యేవి. గత నాలుగైదు రోజులుగా మాత్రం అదే రేంజ్లో టెస్ట్‌లు చేసినప్పటికీ కేసులు మాత్రం సగానికి సగం తగ్గిపోయాయ్. అంటే.. 30 నుంచి 40కి మధ్యలోనే కేసులు నమోదవుతున్నాయ్. దీన్ని బట్టి చూస్తే ఏపీలో పరిస్థితి దాదాపు అదుపులోకి వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఈ కేసుల సంఖ్యను బట్టి చూస్తే ఏపీ ప్రజలు కాస్త ఉపశమనం లభించినట్లే.
వేల సంఖ్యలో టెస్ట్‌లు.. 50కి లోపే కేసులు..
ఇవాళ కూడా.. 10,730 మందికి పరీక్షలు చేయగా కేసులు మాత్రం 33 మాత్రమే పాజిటివ్ అని తేలింది. ఇవాళ నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2051కు చేరుకుంది. ఇవాళ చిత్తూరు-10, తూర్పుగోదావరి-01, కృష్ణా-04, కర్నూలు-09, నెల్లూరు-09, కేసులు మాత్రమే నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క కేసు నమోదు కావడం కాస్త మంచి పరిణామమే అని చెప్పుకోవచ్చు. గత నాలుగైదు రోజులుగా కొన్ని కొన్ని జిల్లాల్లో జీరో కేసులే నమోవుతున్నాయ్. ఇదిలా ఉంటే.. 1056 మంది ఇప్పటి వరకూ డిశ్చార్జ్ కాగా.. 46 మంది మరణించారు. ప్రస్తుతం 949 మంది మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.
తగ్గిపోతున్నాయ్..!
మరోవైపు రాష్ట్రంలో అత్యధికంగా నమోదయ్యే కర్నూలు జిల్లాలో కూడా తక్కువ కేసులే నమోదవుతున్నాయి. ఇవాళ కేవలం 09 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అదే విధంగా గుంటూరు, కృష్ణా జిల్లాలోనూ ఇదే రీతిలోనే కేసులు నమోదవుతున్నాయి. కాగా ఇప్పటి వరకూ కర్నూల్లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 584గా ఉండగా.. గుంటూరు-387, కృష్ణా-346గా ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది.
ఒక్క హైదరాబాద్‌లోనే..
మొత్తానికి చూస్తే కరోనా నుంచి కాస్త ఏపీ కోలుకున్నట్లు చెప్పుకోవచ్చు. అయితే.. తెలంగాణలో మరీ ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో మాత్రం రోజురోజుకూ కేసులు పెరిగిపోతుండటం.. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదవుతుండటం గమనార్హం. ఈ కేసుల లెక్కలతో భాగ్యనగరవాసులు కలవరపాటుకు గురవుతున్నారు. గత కొన్నిరోజులుగా చాలా తక్కువ సంఖ్యలో అంటే సింగిల్ డిజిట్లో మాత్రమే నమోదైన కేసులు ఇప్పుడు హైదరాబాద్‌లో మాత్రం ఊహించని రీతిలో నమోదవుతుండటం షాకింగ్‌కు గురిచేస్తోంది. ఈ కరోనా నుంచి దేశం మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు కోలుకుంటాయో.. ఏంటో పైనున్న పెరుమాళ్లకే ఎరుక.