గుంటూరు జిల్లాలో ఒక్క ఉపాధ్యాయుని ద్వారా 39 మందికి కరోనా..
- IndiaGlitz, [Friday,October 02 2020]
ఒక ట్యూషన్ చెప్పే ఉపాధ్యాయుని ద్వారా 14 మంది చిన్నారులు సహా 39 మందికి కరోనా సోకింది. నేరుగా క్లాసులు నిర్వహించవద్దు.. ఆన్లైన్ క్లాసులు మాత్రమే నడిపించాలని ప్రభుత్వం చెబుతున్న మాటలను పెడచెవిన పెట్టారో ఉపాధ్యాయుడు. ట్యూషన్ సెంటర్ ఓపెన్ చేసి నేరుగా విద్యార్థులకు క్లాసులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే సడెన్‌గా ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ ఉపాధ్యాయుని ద్వారా ఏడేళ్ల లోపు చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు సైతం.. మొత్తంగా 39 మందికి కరోనా సోకింది. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భట్లూరులో చోటు చేసుకుంది.
భట్లూరులో ఓ ఉపాధ్యాయుడు ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయన వద్దకు ట్యూషన్ నిమిత్తం వెళ్లే 50 మంది విద్యార్థులకు పరీక్ష చేయించారు. ఈ పరీక్షల్లో 14 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే నిర్ధారణ అయిన వారంతా ఏడేళ్ల లోపు చిన్నారులు కావడం ఆందోళన కలిగిస్తోంది. వెంటనే అధికారులు చిన్నారుల తల్లిదండ్రులకు పరీక్ష చేయించగా.. మరో 25 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఇక అధికార యంత్రాంగమంతా భట్లూరుపై దృష్టి సారించింది. భట్లూరు ఎస్సీ కాలనీ మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించి పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి గ్రామ ప్రజలందరి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. వైరస్ బాధితులందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. మరోవైపు ఆన్లైన్ క్లాసులు తప్ప.. నేరుగా క్లాసులు నిర్వహించ కూడదనే నిబంధనలను ఉల్లఘించినందున ఉపాధ్యాయుడికి అధికారులు నోటీసులు జారీ చేశారు.