కరోనా ఎఫెక్ట్ : టోక్యో ఒలింపిక్స్ ఏడాది వాయిదా!
- IndiaGlitz, [Tuesday,March 24 2020]
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం ఒలింపిక్స్ క్రీడలపై కూడా పడింది. ఈ క్రమంలో జపాన్లోని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలు వాయిదా వేయాలని నిర్ణయించడం జరిగింది. కాగా.. షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉండగా.. ఏడాదికి వాయిదాపడ్డాయి.
ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో 124 ఏళ్లలో ఒలింపిక్స్ వాయిదా పడటం ఇదే ఫస్ట్ టైమ్. కరోనా నేపథ్యంలోనూ ఒలింపిక్స్ జరుపుతామని జపాన్ ధీమా వ్యక్తం చేసినప్పటికీ.. రోజురోజుకూ మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో చివరి నిమిషంలో ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదట్నుంచీ ఒలింపిక్స్ వాయిదా వేయాలని సభ్య దేశాలు పదే పదే డిమాండ్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. సభ్యదేశాలతో పాటు అంతర్జాతీయంగా ఒత్తిళ్లు కూడా తీవ్రమైన నేపథ్యంలో జపాన్ ప్రధాని షింజే అబేతో ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ సమావేశమై.. వాయిదా వేయాలని నిర్ణయించి ఈ ప్రకటన చేయడం జరిగింది.