కరోనా ఎఫెక్ట్.. ఏపీలో 'పది' పరీక్షలు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న పదో తరగతి పరీక్షలపై కరోనా ప్రభావం పడింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ప్రకటించిన విషయం విదితమే. కాగా.. ఈ క్రమంలో మార్చి 31 న జరగాల్సిన పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖమంత్రి ఆది మూలపు సురేష్ విద్యాశాఖ ఉత్తర్వులు ద్వరా వెల్లడించారు. రెండు వారాలపాటు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 31 తర్వాత పరిస్థితి ఆధారంగా పరీక్షల తేదీలు ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. అంతేకాదు.. ఎంసెట్, ఐసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువునూ పొడిగిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

కోర్టు తీర్పు రాకమునుపే..!

కాగా.. పది పరీక్షలు వాయిదా వేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని నిశితంగా పరిశీలించిన హైకోర్టు వాయిదా వేయాలని ఆదేశించే లోపే.. సర్కార్ స్పందింస్తుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అయితే ఈ ఆదేశాల రాక మునుపే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే.. ఇవాళ ఉదయం కరోనా కట్టడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే కోర్టు తీర్పు రాకమునుపే వాయిదా వేయడం జరిగింది. అయితే తదుపరి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇప్పటికే తెలంగాణలో..!

తెలంగాణలోనూ పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే.. వాయిదా పడ్డ ఆ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయం మాత్రం తెలియరాలేదు. ఈ నెల 29న అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించిన తర్వాత తదుపరి పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి..? ఎలా నిర్వహించాలి..? అనే విషయంపై నిశితంగా చర్చించి ఉన్నతాధికారులు తదుపరి నిర్ణయం తీసుకొని హైకోర్టుకు తెలియజేయనున్నారు.