కరోనా ఎఫెక్ట్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న రామోజీ
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి ఎఫెక్ట్ ప్రపంచంపై అంతా ఇంతా కాదు. చాలా వరకూ సంస్థలన్నీ కుదేలైపోయాయి. కాస్తో కూస్తో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చి కొన్ని నెలలు గడుస్తున్నా.. మహమ్మారి చేసిన గాయం మాత్రం మానడం లేదు. కరోనా ప్రభావం ప్రింట్ మీడియాపై కూడా దారుణంగా పడింది. ఈ నేపథ్యంలోనే చాలా సంస్థలు పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకూ కోతలు విధించినప్పటికీ పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. ఈ క్రమంలోనే పత్రికా యాజమాన్యాలు అనూహ్య నిర్ణయానికి వస్తున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా ప్రకటనలు పెద్దగా రాకపోగా.. ముద్రణ వ్యయం సైతం పెరిగింది. దీంతో పత్రికా యాజమాన్యాలు స్పెషల్ పేజీల మాట అటుంచితే పేజీల సంఖ్యలో సైతం కోత విధించాయి. ఈ ప్రభావం రామోజీ గ్రూప్‌పై కూడా పడింది. కోవిడ్ ప్రభావం నేపథ్యంలో రామోజీ ఫౌండేషన్ అధినేత రామోజీరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నాలుగు మాస పత్రికలను మూసివేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. విపుల, చతుర, తెలుగు వెలుగు, బాలభారతం ఇక నుంచి కనిపించబోవని రామోజీ ఫౌండేషన్ వెల్లడించింది. పాఠకుల అభిరుచి ఊహించని రీతిలో మారిపోవడానికి.. కరోనా కల్లోలం తోడు కావడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.
కాగా.. రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1978 నుంచి విపుల, చతురలు నడుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనువదించిన కథలను తెలుగు పాఠకులకు అందించే ఉద్దేశంతో విపుల మాస పత్రికను ప్రారంభించగా.. ఇప్పటి వరకూ 8 వేల వరకు కథలను ప్రచురించారు. చతురలో 518కిపైగా నవలలను ప్రచురించారు. తెలుగు భాషకు, సాహిత్యానికి సేవ చేసే ఉద్దేశంతో 2012 సెప్టెంబర్‌లో తెలుగు వెలుగును ప్రారంభించారు. 2013 జూన్‌లో భాలభారతం ప్రారంభమైంది. అన్ని వర్గాల వారికీ అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో.. నష్టాలు వస్తున్నా ఖాతరు చేయకుండా ఈ నాలుగు మాస పత్రికలను నామమాత్రపు ధరకే అందించామని.. కానీ నష్టాలు తారాస్థాయికి చేరడంతో ఏప్రిల్ నెల నుంచి నిలిపివేస్తున్నామని రామోజీ ఫౌండేషన్ ప్రకటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout