కరోనాతో కుటుంబ పెద్ద.. పలకరించే దిక్కులేక కుటుంబం బలి..
- IndiaGlitz, [Wednesday,August 19 2020]
‘పోరాడాల్సింది రోగంతో కానీ.. రోగితో కాదు’ అని ప్రభుత్వాలు ఎంతగా ఊదరగొడుతున్నా అది ప్రజల చెవులకు మాత్రం ఎక్కడం లేదు. చదువుకోని వారే కాదు.. చదువుకున్న వారు సైతం కరోనా విషయంలో ఒకేలా వ్యవహరిస్తున్నారు. కరోనా వచ్చిందంటే ఆ వ్యక్తినే కాదు.. పూర్తిగా ఆ కుటుంబాన్నే స్థానికులు, బంధువులు వెలిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి కారణంగా ఒకరు బలైతే.. వివక్షను భరించలేక కుటుంబం మొత్తం బలవుతోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఓ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కారణం తెలిస్తే మనసున్నవారికెవరికైనా కన్నీళ్లు రాక మానవు. జిల్లాలోని పసివేదల గ్రామానికి చెందిన పరిమి నరసయ్య అనే వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతడు చికిత్స పొందుతూ ఈ నెల 16వ తారీఖున మృతి చెందాడు. కుటుంబ పెద్ద మృతి ఆ కుటుంబాన్ని ఓ వైపు కుంగదీస్తే.. మరోవైపు గ్రామస్తులు, బంధువులు, కుటుంబ సభ్యులు చూపిన వివక్ష మరోవైపు కుంగదూసింది.
తమ కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి కనీస ఆదరణ లభించలేదు. దగ్గరి బంధువులు సైతం పరామర్శించలేదు సరికదా మొహం చాటేశారు. దీంతో నరసయ్య భార్య పరిమి సునీత(50), కుమారుడు పరిమి ఫణి కుమార్ (25), కుమార్తె పరిమి లక్ష్మీ అపర్ణ (23) గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు సైతం పలకరించడానికి రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.