కరోనా నేపథ్యంలో ‘మీడియా’కు ఫేస్‌బుక్ భారీ సాయం
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కాటేస్తోంది. రోజురోజుకూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. మరోవైపు మరణాల సంఖ్య.. వీటన్నింటి కంటే కొన్ని రెట్లు ఎక్కువగా అనుమానితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో దేశం మొత్తం లాక్‌డౌన్ అయినప్పటికీ ఫోర్త్ ఎస్టేట్‌గా పిలవడే ‘మీడియా’ మాత్రం కరోనా కల్లోలానికి తలవంచకుండా పనిచేస్తోంది. టీవీ, వార్తా పత్రికలు మరీ ముఖ్యంగా డిజిటల్ (వెబ్) మీడియా ప్రపంచ మానవాళికి వార్తలు చేరవేస్తూ నిత్యం ప్రజలకు.. ప్రపంచానికి వారధిగా ఉంటూ వస్తోంది. ఇలాంటి క్రమంలో మీడియాను ఆదుకునేందుకు.. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ముందుకొచ్చి మంచి మనసు చాటుకుంది.
100 మిలియన్లు ఇస్తున్నాం..
కరోనా వైరస్ కారణంగా నష్టపోయిన మీడియా పరిశ్రమను ఆదుకునేందుకు తాజాగా 100 మిలియన్లు (10కోట్ల డాలర్లు) మేర విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. సంక్షోభ సమయంలో విశ్వసనీయ సమాచారం చాలా అవసరమని.. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించే మీడియా అసాధారణ పరిస్థితుల్లో ఉండటంతో తాము సాయం ప్రకటించామని.. మరీ ముఖ్యంగా కరోనా కాటేస్తున్న తరుణంలో మీడియాకు ప్రకటనలు రావట్లేదని దీంతో ఆదాయం చాలా తగ్గిపోతుందని ఫేస్‌బుక్ తెలిపింది. ఈ సందర్భంగా ఓ ప్రకటనలో ఫేస్‌బుక్ యాజమాన్యం తెలిపింది.
ఇదివరకే సాయం..
ఈ వంద మిలియన్లలో ఫేస్‌బుక్ జర్నలిజం ప్రాజెక్టు ద్వారా స్థానిక మీడియా సంస్థలకు అత్యవసర గ్రాంటు కింద 25 మిలియన్ డాలర్లు, మార్కెటింగ్ ద్వారా పబ్లిషర్లకు ఆదాయం కల్పించేలా మరో 75 మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇంతకు ముందు మేము వార్తా పరిశ్రమకు ప్రకటించిన సాయానికి ఇది అదనంగా ఇస్తున్నట్లు.. ఇప్పటికే స్థానిక మీడియా సంస్థల కోసం 1 మిలియన్ డాలర్లు, ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలకు 1 మిలియన్ డాలర్లు, అంతర్జాతీయ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్‌వర్క్ కోసం 1 మిలియన్ డాలర్లు ప్రకటించిన విషయాన్ని యాజమాన్యం ఈ సందర్భంగా గుర్తు చేసింది.
మీడియాకు.. ఫేస్‌బుక్‌కు లింకేంటి..?
కాగా.. మీడియా ద్వారా ఫేస్‌బుక్ కూడా గట్టిగానే ఆదాయం వస్తుందన్న విషయం తెలిసిందే. ఏదైనా వార్త లేదా.. వీడియో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తే ఆ మీడియా యాజమాన్యంతో పాటు.. ఫేస్‌బుక్ కూడా వ్యూస్, లైక్స్, షేర్స్‌ను గట్టిగా ముట్టుతుంది. అందుకే ప్రస్తుతం మీడియా కష్ట కాలంలో ఉందని తమ వంతుగా ఫేస్‌బుక్ సాయం ప్రకటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments