తమిళనాడులో థియేటర్స్‌కు మళ్లీ దెబ్బ.. తెలుగు రాష్ట్రాల్లో కూడా..

  • IndiaGlitz, [Thursday,April 08 2021]

కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ దారుణంగా దెబ్బతిన్నది. దీంతో ఈ పరిశ్రమపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇక గత ఏడాది మార్చి మొదలు.. ఎండింగ్ వరకూ థియేటర్స్ మూతపడ్డాయి. ఏదో ఈ ఏడాది కాస్త బాగుంది అనుకునే లోగా తిరిగి మరోసారి కరోనా సెకండ్ వేవ్ మరింత రెట్టించిన ఉత్సాహంతో విరుచుకు పడింది. ప్రస్తుతం దేశంలో లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తిరిగి దెబ్బ ఈ పరిశ్రమకే ఎక్కువగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. షూటింగ్‌ల మాట అటుంచితే థియేటర్లలో జనాల సంఖ్య పెరిగిపోయి కరోనా వ్యాప్తికి చాలా అనుకూలంగా మారుతుంది. దీంతో మొదటి దెబ్బ థియేటర్స్‌కే.

ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడు ప్రభుత్వం థియేటర్స్‌పై దృష్టి సారించింది. కరోనా మహమ్మారి వ్యాప్తికి కారణమవుతున్న వాటిలో సినిమా థియేటర్లు సైతం ప్రముఖంగా కనిపిస్తున్నాయి. థియేటర్లకు పర్మిషన్ ఇచ్చిన మొదట్లో 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆ తర్వాత పరిస్థితులు కాస్త అనుకూలించాక వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను రన్ చేసుకోవచ్చని వెల్లడించింది. మునుపటి రోజులు రాబోతున్నాయని థియేటర్ల యాజమాన్యం ఆనందించే లోపు తిరిగి తమిళనాడు 50 శాతం ఆక్యుపెన్సీతో రన్ చేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అది కూడా ఏప్రిల్ 10 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం పరిస్థితి ఏమీ భిన్నంగా లేదు. కరోనా మహమ్మారి ఇక్కడ కూడా విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యాలయాలకు సెలవు ప్రకటించి ఒక ముందడుగు అయితే వేసింది. ఇక కరోనా వ్యాప్తికి కారణమవుతున్న వాటిలో థియేటర్స్ కూడా ఒకటి కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తే.. ఇక్కడ కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో రన్ చేసుకోవాలనే ఆదేశాలు వచ్చే అవకాశమూ లేకపోలేదు. పరిస్థితులు చూస్తుంటే అది మరెంత దూరంలో ఉన్నట్టుగా లేదు. శుక్రవారం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ విడుదల కానుంది. ఈ సినిమాతోనే ఈ ఆదేశాలు ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. మూడు, నాలుగు రోజుల్లోనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావొచ్చని సమాచారం.