సాధారణ జలుబులా కరోనా...!
- IndiaGlitz, [Thursday,January 14 2021]
ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కరోనా మహమ్మారి.. భవిష్యత్తులో సాధారణ జలుబులా ప్రజల్లో పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జలుబులా వచ్చిపోయే స్థితికి కరోనా ఇన్ఫెక్షన్ చేరిన తర్వాత.. సాధ్యమైనంత ఎక్కువమంది బాల్యంలోనే దాని బారినపడతారని ఎమోరీ వర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
సార్స్ వైర్‌స్‌తో పాటు సాధారణ జలుబుకు కారణమయ్యే నాలుగు కరోనా వైరస్ రకాలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు దాని ఆధారంగా రూపొందించిన ఓ నివేదిక ‘జర్నల్ సైన్స్’లో ప్రచురితమైంది. అయితే దీని గురించి ఓ శుభవార్తను కూడా శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా ఇన్ఫెక్షన్.. ప్రధానంగా మూడు నుంచి ఐదేళ్లలోపు పిల్లలు ఈ ఇన్‌ఫెక్షన్‌ను ఎదుర్కుంటారని.. అయితే బాల్యంలో సోకిన ఇన్ఫెక్షన్‌తో కలిగిన రోగ నిరోధకత రక్షణ కవచంలా కాపాడుతుందని తెలిపారు.
మున్ముందు చిన్నారులు తేలికపాటి కొవిడ్ ఇన్ఫెక్షన్‌ను సాధారణ జలుబు రూపంలో చవిచూడాల్సి రావచ్చన్నారు. ఇక పెద్దల విషయానికి వస్తే.. ప్రస్తుతం కరోనా టీకాలు వేయించుకునే వారికి తాత్కాలిక రక్షణే లభించినప్పటికీ, వ్యాక్సిన్ల ప్రభావంతో మరోసారి సోకే ఇన్ఫెక్షన్ తీవ్రత చాలా మేరకు తగ్గుతుందన్నారు. ఇప్పటికే కరోనా కేసులు దేశంలో భారీగా తగ్గిపోయాయి. కాగా.. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రభావం అయితే దేశంలో చాలా వరకూ తగ్గిపోయింది.