ఏపీని కుదిపేస్తున్న.. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కానుందనే వార్త
Send us your feedback to audioarticles@vaarta.com
విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కానుందనే వార్త ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తోంది. ఈ సందర్భంగా దీనిపై నేతలతో పాటు సామాన్య ప్రజానీకం నుంచి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 1971లో విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారానికి నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణం 1977లో ప్రారంభమైంది. 1979లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది పూర్తి కావడానికి 20 ఏళ్ల సమయం పట్టింది. ఈ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. మొత్తానికి 1987 డిసెంబరు నాటికి విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణం పూర్తయ్యింది.
మొత్తం దీని నిర్మాణానికి రూ.9 వేల కోట్లు ఖర్చు అయ్యింది. 1990 సెప్టెంబరులో ఉత్పత్తి ప్రారంభమైంది. 1992లో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు ఈ కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. తొలిసారిగా 1994లో ఈ కర్మాగారం రూ.50 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఆ తర్వాత కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్న మీదట విశాఖ ఉక్కు కర్మాగం.. ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచశ్రేణి ఉక్కు కర్మాగారంగా నిలబడింది. అయితే ఈ విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఆంధ్రులు చేసిన శ్రమ అంతా కాదు.. ప్రాణ త్యాగాలు సైతం చేయాల్సి వచ్చింది.
అర్ధ శతాబ్దం కిందట 'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' నినాదంతో పెద్ద ఉద్యమమే జరిగింది. 1966 నవంబర్ ఒకటో తేదీ.. విశాఖపట్నంలో ప్రదర్శన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ముగ్గురు విద్యార్థులు, మరో ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఆ రోజు విశాఖ సహా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు కాల్పుల్లో మొత్తం 32 మంది చనిపోయారు. ఇన్ని ప్రాణాలను బలిపెట్టి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తున్న వార్తలను ఏపీ ప్రజానీకం జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటికే విశాఖ ఉత్తర ఎమ్మెల్యే.. ఒకవేళ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం చేసే పరిస్థితే ఉంటే ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout