Varasudu : మాది ఆపితే.. మీది ఆపుతాం.. టాలీవుడ్, కోలీవుడ్‌ల మధ్య 'వారసుడు' చిచ్చు
Send us your feedback to audioarticles@vaarta.com
ఓటీటీల జోరుతో ఢీలా పడ్డ తెలుగు చిత్ర పరిశ్రమ తిరిగి సాధారణ స్థితికి చేరేందుకు నానా తంటాలు పడుతోంది. ఎంతో బాగుంటే తప్ప ప్రేక్షకులు థియేటర్‌కు రావడం లేదు. దీంతో చిన్నా, పెద్ద సినిమాలు పండుగల సీజన్‌ను టార్గెట్ చేశాయి. అయితే బడా మూవీలకే థియేటర్లు దొరకని నేపథ్యంలో ఇటీవల తెలుగు నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతికి స్ట్రయిట్ తెలుగు సినిమాలకే ప్రథమ ప్రాథాన్యం ఇవ్వాలని..డబ్బింగ్ సినిమాలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. దీంతో స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజుకు షాక్ తగిలినట్లయ్యింది.
దిల్‌రాజునే సవాల్ చేసిన నిర్ణయం:
ఇళయ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తోన్న ‘‘వారసుడు’’ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇది తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతోందని పైకి చెబుతున్నప్పటికీ.. తమిళంలో తీసి తెలుగులోకి డబ్ చేస్తున్నట్లు ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఇండస్ట్రీని శాసిస్తున్న వారిలో ఒకరైన దిల్‌రాజుకు ఎదురు నిలిచేవారెవ్వరు. కానీ.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ధైర్యం చేసి ఈ నిర్ణయం తీసుకోవడంతో దిల్‌రాజు భగ్గుమన్నారట.
తెలుగు నిర్మాతలపై భగ్గుమంటోన్న కోలీవుడ్:
అయితే ఇప్పడీ నిర్ణయం టాలీవుడ్, కోలీవుడ్‌లలో సంచలనానికి దారి తీయడమే కాకుండా వివాదాస్పదమవుతోంది. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీరుపై తమిళ దర్శక , నిర్మాతలు మండిపడుతున్నారు. తమిళనాడులో తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నా తాము అడ్డు చెప్పడం లేదని.. మరి తెలుగు రాష్ట్రాల్లో తమిళ సినిమాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. డబ్బింగ్ సినిమాల విషయంలో నిర్ణయాన్ని మార్చుకోకుంటే తాము కూడా తమిళనాడులో తెలుగు సినిమాలను అడ్డుకుంటామని తమిళ డైరెక్టర్ సీమాన్ హెచ్చరించారు. వాస్తవానికి వారసుడు సినిమా దర్శక, నిర్మాతలిద్దరూ తెలుగువారేనని.. హీరో మాత్రమే తమిళ నటుడని... అలాంటప్పుడు సినిమా రిలీజ్‌కు ఎందుకు ఆటంకాలు సృష్టిస్తున్నారని సీమాన్ నిలదీస్తున్నారు. ఇంత జరుగుతుంటే సౌతిండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఏం చేస్తోందని మరో దర్శకుడు లింగుస్వామి ప్రశ్నిస్తున్నారు. భాషాపరంగా ఇరు ప్రాంతాల మధ్య విద్వేషాలు వస్తాయని ఆయన హితవు పలుకుతున్నారు.
సినిమాకు నార్త్, సౌత్ భేదం లేదన్న అల్లు అరవింద్:
వివాదం ముదురుతుండటంతో తెలుగు నిర్మాతల మండలి స్పందించింది. తమిళ సినిమాలను అడ్డుకుంటామని తాము చెప్పలేదని... తెలుగు సినిమాలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని మాత్రమే చెప్పామని అంటోంది. అటు మరో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. డబ్బింగ్ సినిమాలను అడ్డుకోవడం సాధ్యమయ్యే పనికాదని.. సినిమాకు నార్త్, సౌత్ అనే భేదాలు లేవని బాగుంటే ఎక్కడైనా ఆడుతుందని అరవింద్ అన్నారు. మరి ఇంతటి వివాదం నేపథ్యంలో ‘‘వారసుడు’’ సినిమా విషయంలో దిల్‌రాజు వెనక్కి తగ్గుతారా లేక సంక్రాంతికే రిలీజ్ చేస్తారా అన్నది టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com