జయప్రదపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. నేను చచ్చిపోవాలా!?

  • IndiaGlitz, [Monday,April 15 2019]

ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నేతల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే ఆమెకు ప్రాణహానీ ఉందని చెప్పడంతో ‘వై’ కేటగిరి భద్రతను కేంద్రం కేటాయించడం జరిగింది. అయితే ఆమె రీ-ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి నేటి వరకూ రోజు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా జయప్రదకు.. మాజీ మంత్రి, సమాజ్‌వాది పార్టీ నేత అజంఖాన్‌కు మధ్య జరుగుతున్న గొడవకు ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడేలా లేదు. ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు అజంఖాన్.. తాజాగా జయప్రదపై మరోసారి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

అసలేం జరిగింది..!?

జయప్రదను నేనే రాంపూర్‌కు తెచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్‌ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను అని ఖాన్‌ ఓ ఎన్నికల సభలో ఆజాంఖాన్ బహిరంగంగా చెప్పడంతో మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా.. జయప్రద బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ సంబందాలను దృష్టిలో ఉంచుకుని అజంఖాన్ ఈ నిక్కర్ అనే వ్యాఖ్య చేశారు.

మహిళా కమిషన్ రియాక్షన్...

ఆజాంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలపై మహిళా కమిషన్ అద్యక్షురాలు రేఖా శర్మ ఘాటుగా స్పందించారు. జయప్రదను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అగౌరవకరంగా ఉన్నాయన్నారు. అతి త్వరలోనే ఆజాంకు నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. అంతేకాదు ఎన్నికల్లో ఆయన్ను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. కాగా ఆజాంఖాన్‌పై పోలీసు కేసు.. జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం జరిగింది.

నేను చచ్చిపోవాలా...!!

అయితే ఈ వ్యవహారంపై తాజాగా జయప్రద మరోసారి మీడియా ముందుకొచ్చారు. ఇవన్నీ నాకు కొత్త కాదు. ఆజాంఖాన్‌కు నేనేం చేశాను. నేను చచ్చిపోవాలా.? అలా చేస్తే ఆయన శాంతిస్తారా..? ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాంపూర్ వదిలి వెళ్ళిపోతానని అనుకుంటున్నారేమేమో..? నేను ఎక్కడికీ వెళ్ళను. ఇలాంటి వ్యక్తులు గెలిస్తే మహిళలకు రక్షణ ఏం ఉంటుంది అని జయప్రద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే జయప్రద వ్యాఖ్యలు, పోలీసు కేసు, నోటీసులపై ఆజాంఖాన్‌ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.