కోల్గేట్ సంస్థకు జరిమానా విధించిన వినియోగదారుల ఫోరం..
Send us your feedback to audioarticles@vaarta.com
కోల్గేట్ సంస్థకు వినియోగదారుల ఫోరం మొత్తంగా రూ.15 వేల జరిమానా విధించింది. ఎక్కువ ధరకు పేస్ట్ అమ్ముతూ వినియోగదారులను మోసం చేస్తోందని కోల్గేట్ సంస్థపై ఓ వ్యక్తి వినియోగదారుల ఫోరంలో కేసు వేశాడు. కేసును విచారించిన వినియోగదారుల ఫోరం కోల్గేట్ సంస్థకు జరిమానా విధించింది. సంగారెడ్డికి చెందిన సీహెచ్ నాగేందర్ న్యాయవాదిగా పని చేస్తున్నారు. 2019 ఏప్రిల్ 7న సంగారెడ్డి పట్టణంలోని రిలయన్స్ ఫ్రెష్ రిటైల్ మాల్‌లో 150 గ్రాముల కోల్గేట్ మాక్స్ టూత్ పేస్ట్ రూ. 92కు కొనుగోలు చేశారు.
అయితే నాగేందర్ ఆ పేస్ట్‌తో పాటు 20 గ్రాముల కోల్గోట్ మాక్స్ టూత్‌పేస్ట్ రూ. 10లకు కొనుగోలు చేశారు. పది రూపాయలకు 20 గ్రాముల చొప్పున కొనుగోలు చేస్తే 150 గ్రాములకు రూ.75 అవుతుంది. కానీ 150 గ్రాముల పేస్ట్‌కు రూ.92 తీసుకున్నారు. అంటే రూ. 17 అదనంగా తీసుకుంటున్నారు. దీంతో నాగేందర్ వెంటనే పేస్టు ధరను ఎందుకు ఎక్కువ తీసుకున్నారంటూ కోల్గేట్ సంస్థ వారికి నోటీసులు పంపించారు. అయితే సంస్థ నుంచి నాగేందర్‌కు ఎలాంటి సమాధానమూ రాలేదు. దీంతో ఆయన వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన వినియోగదారుల ఫోరం కోల్గేట్ సంస్థకు జరిమానా విధించింది. సంస్థ అదనంగా వసూలు చేసిన రూ. 17 తిరిగి ఇవ్వాలని, ఆయనను మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ.10 వేలు, ఖర్చుల కింద రూ.5 వేలు అదనంగా ఇవ్వాలని వినియోగదారుల ఫోరం చైర్మన్ పి.కస్తూరి, సభ్యురాలు డి.శ్రీదేవి తీర్పు చెప్పారు. వినియోగదారుల సంక్షేమ నిధికి అదనంగా రూ. 50 వేలు ఇవ్వాలని కోల్గేట్ సంస్థను ఆదేశించారు. ఇవన్నీ నెల రోజుల్లోగా వినియోగదారుడు నాగేందర్‌కు చెల్లించాలని వినియోగదారుల ఫోరం తేల్చి చెప్పింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments