Janasena: జనసేన పార్టీలో చేరిన కాంగ్రెస్, వైసీపీ నాయకులు
- IndiaGlitz, [Wednesday,January 03 2024]
2024లో రాష్ట్రంలో పెద్ద మార్పును తీసుకురాబోతున్నామని.. ప్రభుత్వంలో బలమైన భాగస్వామ్యం తీసుకుంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు జనసేనలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్, వైసీపీ నాయకులకు కండువా కప్పి పవన్ కల్యాణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం పవన్ మాట్లాడుతూ తనను నమ్మి పార్టీలోకి వచ్చిన అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని స్పష్టంచేశారు. నూతన చేరికలతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర మాజీ అధ్యక్షుడు బాడిత శంకర్, మాజీ కార్పొరేటర్లు చిలక సలోమి భగవాన్, సముద్రాల ప్రసాద్, అవనిగడ్డకు చెందిన వైసీపీ నాయకుడు రామాంజనేయులు పార్టీలో చేరారు. ఈ చేరికల కార్యక్రమంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే పార్టీలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌కు పవన్ కల్యాణ్ కీలక పదవి అప్పగించారు. ఆయనను విశాఖ జిల్లా జనసేన అధ్యక్షుడిగా నియమించారు. దీంతో ఇక నుంచి జిల్లా బాధ్యతలను వంశీకృష్ణ చూసుకుంటారని పార్టీ తెలిపింది. కాగా వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఈనెల 22న అయోధ్య(Ayodhya)లో జరగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆర్‌ఎస్ఎస్ ప్రాంత సంపర్క్ ప్రముఖ్ ముళ్లపూడి జగన్ ఆహ్వానపత్రికను పవన్‌కు అందజేశారు. అయితే సౌత్ ఇండస్ట్రీ నుంచి కేవలం సూపర్ స్టార్ రజనీకాంత్, పవన్ కల్యాణ్‌లకు మాత్రమే ఆహ్వానం రావడం విశేషం.