Telangana Congress: రెబల్స్ విషయంలో ఫలించిన కాంగ్రెస్ వ్యూహం

  • IndiaGlitz, [Wednesday,November 15 2023]

తెలంగాణ ఎన్నికల్లో నేటితో నామినేషన్ల ఉపంసహరణ ప్రక్రియ ముగిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 2898 నామినేషన్లను అధికారులు ఆమోదించారు. అత్యధికంగా గజ్వేల్‌ బరిలో 86 మంది అభ్యర్థులు నిలవగా.. అత్యల్పంగా నారాయణపేటలో ఏడుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. చాలా నియోజకవర్గాల్లో రెబల్స్ పోటీలో దిగడంతో ఆయా పార్టీల నేతలు వారిని బుజ్జగించడంతో పలువురు వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పటేల్ రమేష్ రెడ్డిని బుజ్జగించేందుకు మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి ఆయన ఇంటికి వెళ్లారు. ఎంపీ సీటు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు.

ఇక డోర్నకల్‌లో కాంగ్రెస్ రెబల్‌గా నెహ్రూ నాయక్‌కు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన కూడా వెనక్కి తగ్గారు. బాన్సువాడ టికెట్‌పై కాసుల బాలరాజు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే టికెట్ రాకపోవడంతో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. చికిత్స తర్వాత కోలుకున్న బాలరాజు.. రెబల్‌గా నామినేషన్ వేశారు. అయితే పార్టీ బుజ్జగింపులతో వెనక్కి తగ్గారు.

జుక్కల్‌లో రెబల్‌గా నామినేషన్ వేసిన గంగారాంకి సైతం ఎమ్మెల్సీ హామీ ఇవ్వడంతో ఆయన కూడా పోటీ నుంచి విరమించుకున్నారు. ఇక వరంగల్‌ వెస్ట్‌లో రెబల్‌గా నామినేషన్ వేసిన జంగా రాఘవరెడ్డి కూడా పార్టీ పెద్దల హాహీతో నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. ఇంకా పినపాక, వైరా సహా పలు నియోజకవర్గాల్లోనూ రెబల్స్‌ను బుజ్జగించడంలో కాంగ్రెస్ నేతలు సక్సెస్ అయ్యారు. అయితే ఆదిలాబాద్‌లో మాత్రం సంజీవరెడ్డి రెబల్‌గా బరిలో ఉన్నారు. మొత్తానికి అధికారంపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ హైకమాండ్.. రెబల్ నేతల గండం నుంచి తప్పించుకోవడంలో విజయవంతమైంది.