తెలంగాణలో ‘హస్త’మిస్తున్నా.. వీళ్లు మారరా?
Send us your feedback to audioarticles@vaarta.com
కూర్చొన్న చోటు నుంచి కదలొద్దు.. కానీ విజయం కావాలంటూ కబుర్లు.. చేతుల నుంచి నియోజకవర్గాలకు నియోజకవర్గాలు జారి పోతున్నా.. నీరో చక్రవర్తిలా ఫిడేలు వాయించుకుంటూ కూర్చోవాలి. ఎవరైనా కాదు కూడదని పాదయాత్రలు చేశారా.. అంతా కలిసి పీత సామెతను గుర్తుకు తెచ్చుకుని కాలు పట్టి లాగాలి. ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతల వ్యవహార శైలి.
తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అయినా.. ఇక్కడ ఆ పార్టీ మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. అటు దుబ్బాక.. ఇటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. అయినా కూడా ఒకరేదో పార్టీని ఫామ్‌లోకి తీసుకొద్దామనుకుంటే మిగిలిన నేతలెవరూ సహకరించే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు సరికదా... అధిష్టానం అనుమతి లేదంటూ పెదవి విరుపులు. అసలు విషయంలోకి వెళితే.. కొద్ది రోజులుగా రైతు సమస్యలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్రకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నుంచి ఏమాత్రం సహకారం లేదు సరికాదా.. పాదయాత్ర ఆఖరి రోజు మాత్రం పెద్ద రణమే జరగబోతోందని తెలుస్తోంది. రేవంత్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన దూకుడుకి కళ్లెం వేయడమనేది సీనియర్లకు అసాధ్యమేనని తెలుస్తోంది.
అయినా సరే ఏదో ఒకరకంగా రేవంత్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు సాగుతూన ఉన్నాయి. రేవంత్ పాదయాత్ర ఆఖరి రోజున నిజానికి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ మణిక్కం ఠాగూర్ హాజరు కావాల్సి ఉంది. ఆయన వస్తారని రేవంత్ వర్గం సైతం బలంగా నమ్ముతోంది కానీ సీనియర్లు ఇక్కడ తమ సీనియారిటీని చూపించి అడ్డుకుంటారా? అనేది ఉత్కంఠగా మారింది. టీపీసీసీ అధ్యక్ష పదవికి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి నెలలు గడుస్తున్నా.. ఆయన స్థానంలో మరొకరిని నియమించిన పాపాన అధిష్టానం పోలేదు. ఈ అధ్యక్షుడి ఎంపికలో మాణిక్కం ఠాగూర్ కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు.. ఆయన మద్దతు ఎక్కువగా రేవంత్‌కే ఉందన్న ప్రచారమూ జరిగింది. మరి రేవంత్‌పై అంత అభిమానమున్న మణిక్కం ఠూగూర్.. రేవంత్ పాదయాత్ర ఆఖరి రోజున హాజరవుతారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ‘హస్త’మిస్తున్నా.. వీళ్లు మాత్రం మారరా? అని జనం బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments