నా తమ్ముడికి ఓటేయ్యండి.. నెక్ట్స్ పీసీసీ నేనే : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్, కాంగ్రెస్‌లో కలకలం
Send us your feedback to audioarticles@vaarta.com
మునుగోడు ఉపఎన్నికపై తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. రానున్న తెలంగాణ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తోన్న ఈ ఎన్నికలో గెలిచేందుకుక అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. సిట్టింగ్ సీటు నిలుపుకోవాలని కాంగ్రెస్... ప్రజల మద్ధతు తమకే వుందని చెప్పుకోవడానికి టీఆర్ఎస్... తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పేందుకు బీజేపీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఇక్కడ ధన ప్రవాహం పోటెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రేవంత్ కంటతడి :
వీటన్నింటితో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇది జీవన్మరణ సమస్య. అంతర్గత కుమ్ములాటతో ఈ ఎన్నిక అనివార్యమైంది. హస్తం పార్టీలోనే వున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సరిపడక రాజీనామా చేశారన్న సంగతి అందరికీ తెలిసిందే. నేతలు, కేడర్ పార్టీనీ వీడుతుండటంతో కాంగ్రెస్ బలహీనంగా మారుతోంది. దీంతో ఇక్కడ ఎలాగైనా గెలవాలని రేవంత్ కృత నిశ్చయంతో వున్నారు. ఎవరు సహకరించినా, సహకరించకపోయినా అన్నీ తానై ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే తనను పీసీసీగా తప్పించాలని కుట్రలు జరుగుతున్నాయంటూ రేవంత్ కంటతడి పెట్టారు.
కాంగ్రెస్ నేతకి వెంకట్ రెడ్డి ఫోన్:
ఇలాంటి పరిస్థితుల్లో టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చెందినదిగా ప్రచారం జరుగుతోన్న ఆడియో టేప్ కలకలం రేపింది. మునుగోడు ఉపఎన్నికలో తన తమ్ముడు, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని ఓ కాంగ్రెస్ నేతతో మాట్లాడిన ఫోన్ కాల్‌కు సంబంధించిన ఆడియో తెలుగునాట సంచలనం సృష్టించింది.
పీసీసీ అవుతా.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తా:
మునుగోడు ఉపఎన్నికలో పార్టీ చూడకుండా తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని వెంకట్ రెడ్డి కోరారు. మంచీచెడు సమయాల్లో రాజగోపాల్ అందుబాటులో వుంటాడని, తనకు పీపీసీ అధ్యక్ష పదవి వస్తుందని ఆయన అన్నారు. ఆ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తానని వెంకట్ రెడ్డి సదరు నేతకు హామీ ఇచ్చారు. దీనిపై ఇంత వరకు ఆయన స్పందించలేదు. ప్రస్తుతం వెంకట్ రెడ్డి కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినట్లుగా తెలుస్తోంది... దాదాపు పది రోజుల పాటు ఆయన అక్కడే వుంటారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments