Congress:కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటనకు రంగం సిద్ధం.. ధరణి స్థానంలో భూభారతి..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈసారి ఎలాగైనా అధికారంలోకి కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్లే ప్రచారంలో దూసుకుపోతుంది. అధికార బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజలను చైతన్యపరుస్తుంది. ఎన్నికలకు చాలా రోజుల ముందే ఆరు గ్యారంటీలను ప్రకటించిన హస్తం పార్టీ వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. అలాగే వివిధ వర్గాలకు డిక్లర్లేషన్లు కూడా ప్రకటించింది. తాజాగా పూర్తి స్థాయి ఎన్నికల మేనిఫెస్టోను వెల్లడించనుంది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేయనున్నారు. ఈ మేనిఫెస్టోలో పేదలకు లబ్ధి చేకూరే విధంగా అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.
పేదింట్లో పెళ్లిళ్లకు ఇప్పుడు అందుతున్న రూ.లక్ష సాయంతో పాటు తులం బంగారం ఇచ్చే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చినట్లు సమాచారం. అలాగే ధరణిపై తీవ్ర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. దాని స్థానంలో భూభారతి అనే విధానాన్ని తీసుకొస్తామని ప్రకటించనున్నారట. ధరణిలో ఉన్న లోపాలన్నింటనీ సవరిస్తామని హామీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే సిటిజన్ ఛార్ట్కి చట్టబద్దత కల్పించనున్నారట. ఇక తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉంది.
ఇక 'అమ్మ హస్తం' పథకం పేరుతో 9 నిత్యావసర సరుకుల పంపిణీ చేయనున్నామని హామీ ఇవ్వనున్నారట. ఆర్ఎంపీలకు గుర్తింపు కార్డు, రేషన్ డీలర్లు, వార్డు సభ్యులకు గౌరవ వేతనం, ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్, ట్రాన్స్ జెండర్లకు ఆటోలు, ప్రత్యేక సంక్షేమ పథకాలు, జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి ప్రజలను ఆకర్షించేలా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపొందించినట్లు చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments