Rahul Gandhi: ఎంపీగా అనర్హత వేటు.. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్, లగేజ్ తీసుకుని ఎక్కడికి వెళ్లారంటే..?

  • IndiaGlitz, [Saturday,April 22 2023]

లోక్‌సభ సభ్యుడిగా అనర్హత వేటు పడటంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రభుత్వం తనకు కేటాయించిన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్‌లో వుంటున్న రాహుల్ శనివారం తనకు సంబంధించిన వస్తువులను, తన తల్లి సోనియా గాంధీ అధికారిక నివాసమైన 10 జన్‌పథ్‌కు తరలించారు. తనకు సంబంధించిన వస్తువులన్నింటినీ తీసుకుని బంగ్లా తాళాలను ఆయన లోక్‌సభ సెక్రటేరీయట్‌కు అప్పగింంచారు. రాహుల్ బంగ్లాను ఖాళీ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బంగ్లా ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు :

ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని లోక్‌సభ హౌసింగ్ కమిటీ ప్యానెల్ గత నెల 27న రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 22 వరకు డెడ్‌లైన్ విధించింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన నాటి నుంచి రాహుల్ గాంధీకి ఢిల్లీలోని తుగ్లక్ లేన్‌లో బంగ్లాను కేటాయించింది ప్రభుత్వం. అయితే ఆయనపై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేయడంతో .. ప్రభుత్వ బంగ్లాలో వుండేందుకు రాహుల్ అర్హత కోల్పోయినట్లు ప్యానెల్ నోటీసుల్లో పేర్కొంది.

అసలేంటీ వివాదం :

కాగా.. 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ కర్ణాటకలోని కోలార్‌లో ఓ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ధిక నేరగాళ్లు లలిత్ మోడీ, నీరవ్ మోడీల పేర్లను ప్రస్తావించారు. ఈ క్రమంలోనే దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరే ఎందుకు వుంటోందోనంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పుబట్టారు. అంతేకాదు.. అప్పట్లోనే రాహుల్‌పై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ పరువు నష్టం దావా వేశారు. దీనిపై సూరత్‌లోని చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్ట్ నాలుగేళ్లుగా విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో గురువారం న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యుడిగా వున్నందున, ఆయన ప్రసంగాలకు ప్రభావం ఎక్కువన్నారు. తక్కువ శిక్ష వేస్తే దీని వల్ల భవిష్యత్తులో ఎవరిపైనైనా సులువుగా నిందలు వేస్తారని .. గతంలోనూ ఇలాగే వ్యవహరించి క్షమాపణలు సైతం చెప్పారని న్యాయమూర్తి గుర్తుచేశారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ ప్రవర్తనలో మార్పు రాలేదని మేజిస్ట్రేట్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. అయితే రాహుల్ గాంధీ అభ్యర్ధన మేరకు వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.

మరుసటి రోజే రాహుల్‌పై అనర్హత :

అయితే పరువు నష్టం కేసులో సూరత్ కోర్ట్ రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్స విధించిన మరుసటి రోజే ఆయనపై లోక్‌సభ అనర్హత వేటు వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1) (ఇ)లోని నిబంధనల ప్రకారం.. రాహుల్ గాంధీ దోషిగా తేలిన తేదీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడైనట్లు లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ తెలిపింది.

శిక్ష నిలుపుదల కుదరన్న గుజరాత్ కోర్ట్ :

మరోవైపు.. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్‌లోని సూరత్ సెషన్స్ కోర్టు గురువారం తోసిపుచ్చింది. తనకు రెండేళ్లు జైలు శిక్ష విధించాల్సినంత కేసు కాదని.. ట్రయల్ కోర్టు ఈ కేసుపై పారదర్శకంగా విచారణ జరపలేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. శిక్షను నిలిపివేయని పక్షంలో తన ప్రతిష్టకు నష్టం కలుగుతుందని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దీనిపై గత గురువారం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈ రోజు తుది తీర్పును వెలువరించింది. అయితే రాహుల్ పిటిషన్‌ను సెషన్స్ కోర్ట్ తిరస్కరించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్ట్ లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం వుంది.

More News

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు : చీఫ్ గెస్ట్‌గా రజనీకాంత్... ఒకే వేదికపై తలైవా, చంద్రబాబు, బాలయ్య

పౌరాణికమైనా, సాంఘీకమైన, జానపదమైన తనదైన అద్భుతమైన నటనతో వెండితెర వేల్పుగా తెలుగు ప్రేక్షుకుల హృదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారు

శరత్‌బాబుకు అస్వస్థత.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలింపు, లేటెస్ట్ అప్‌డేట్ ఇదే

సీనియర్ నటుడు శరత్ బాబు కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ఆయన ఆరోగ్యం కాస్త సీరియస్‌గా వుండటంతో బెంగళూరు

Samantha :సిటాడెల్ ప్రీమియర్ షోలో మెరిసిన సమంత.. ఆమె ధరించిన స్నేక్ నెక్లెస్, బ్రాస్లెట్ ఎన్ని కోట్లో తెలుసా..?

ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో వున్న టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు.

Ramcharan and Upasana:ఆస్కార్ వీడియోతో స‌రికొత్త‌ రికార్డ్ క్రియేట్ చేసిన రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. కోట్లాది మంది అభిమానులున్న అగ్ర క‌థానాయ‌కుడు. రీసెంట్‌గా ఆయ‌న త‌న స‌తీమ‌ణి ఉపాస‌న‌తో క‌లిసి ఆస్కార్ అవార్డ్స్ సంద‌ర్భంగా

Hyderabad: హైదరాబాద్‌లో దొంగల బీభత్సం : ప్రముఖ బుల్లితెర నటి ఇంట్లో భారీ చోరీ.. సొత్తు విలువ 70 లక్షల పైమాటే

హైదరాబాద్‌లో దొంగలు రెచ్చిపోతున్నారు. చైన్ స్నాచింగ్స్‌తో పాటు ఇళ్లలో చొరబడి ఊడ్చేస్తున్నారు.