Karnataka Election: ఎన్నికల స్టంట్లు.. హోటల్‌లో ప్రియాంక గాంధీ సందడి, పిండి కలిపి దోశలు వేసిన సోనియా కుమార్తె
- IndiaGlitz, [Wednesday,April 26 2023]
ఎన్నికల సమయంలో నేతలు ఇచ్చే హామీలు కోటలు దాటుతాయి. అంతేనా.. ప్రచారంలో వాళ్లు చేసే విన్యాసాలు అంతా ఇంతా కాదు. ఇంట్లో చీపురు కూడా పట్టుకోని వాళ్లు రోడ్లన్నీ ఊడ్చేస్తారు. ఇస్త్రీ చేయడం, మగ్గాలు నేయడం, నూలు వడకడం ఇలా తమ ప్రతిభను చూపించేస్తారు. తాజాగా కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఇలాంటి విచిత్రాలే కనిపిస్తున్నాయి. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్ధులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు స్టంట్స్ చేస్తున్నారు. ఎవరేమనుకున్నా పర్లేదన్నట్లుగా వీరు వ్యవహరిస్తున్నారు.
మైసూర్‌లోని హోటల్‌ను సందర్శించిన ప్రియాంక గాంధీ:
తాజాగా ఈ లిస్ట్‌లో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చేరారు. మైసూర్‌లోని మైలారి అగ్రహార రెస్టారెంట్‌కు వెళ్లిన ప్రియాంక గాంధీ కిచెన్‌లో దోశలు వేసి సందడి చేశారు. స్వయంగా పిండిని కలిపి దోశలను వేశారు. అనంతరం వాటిని తనతో పాటు వున్న నేతలందరికీ రుచిచూపించారు. దీనికి సంబంధించిన వీడియోలు , ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్లతో ప్రియాంక గాంధీ ముచ్చటించారు.
Perfect dosas are just the beginning; with such skillful hands, there's no limit to the power they can bring to the world. pic.twitter.com/qsgUw6IBeJ
— Congress (@INCIndia) April 26, 2023
మే 10న కర్ణాటక ఎన్నికలు :
కాగా.. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ పేర్కొంది. మే 10న పోలింగ్, మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏప్రిల్ 13న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నామినేషన్ల దాఖలకు తుది గడువు ఏప్రిల్ 20.. ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఏప్రిల్ 24గా నిర్ణయించారు. ఈ క్రమంలో కర్ణాటక వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.