Addanki Dayakar: అద్దంకి దయాకర్‌కు మళ్లీ మొండిచెయ్యే.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. చివరి నిమిషంలో అద్దంకి దయాకర్‌కు మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. రెండు ఎమ్మెల్సీలను బల్మూరి వెంకట్, బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్‌కి కేటాయించింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆఖరి నిమిషంలో పేర్లు మారుస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నామినేషన్లకు గురువారమే చివరి తేదీ కావడంతో నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని వారిద్దరికీ ఫోన్ చేసి చెప్పింది. కాగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దయాకర్‌ను వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేయించాలని భావిస్తున్నారట.
తెలంగాణలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనవరి 18న నామినేషన్లకు చివరి తేదీగా ప్రకటించింది. జనవరి 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం కౌంటింగ్ జరిపి ఫలితాలను ప్రకటించనున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలం దృష్ట్యా రెండు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ దక్కించుకోనుంది. సామాజిక సమీకరణాలతో పాటు మిగతా అంశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
అలాగే గవర్నర్ కోటాకు సంబంధించి ప్రొఫెసర్ కోదండరామ్, జావెద్ అలీ ఖాన్ కుమారుడు అమీర్ అలీ ఖాన్ పేర్లను కూడా దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే సీనియర్ నేతలకు మాత్రం నిరాశే ఎదురైంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, అంజనీకుమార్ యాదవ్, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, మధుయాష్కీ గౌడ్‌లు ఎమ్మెల్సీ టికెట్లు ఆశించారు. వీరితో కొంతమందికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవులు ఇస్తారనే చర్చ కూడా జరిగింది. కానీ అధిష్టానం మాత్రం వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని వీరెవరికి టికెట్ నిరాకరించింది. అయితే వీరికి కేబినెట్ హోదాతో కూడిన నామినేటెడ్ పదవులు లేదా లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్లు కేటాయించే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments