Maheshwar Reddy: బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుంది: మహేశ్వర్ రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
తమ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని టచ్ చేసినా 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరూ ఎవరికీ అమ్ముడుపోరని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే మాత్రం ప్రభుత్వం ఉండదని తీవ్ర హెచ్చరికలు చేశారు. తాము కనుక గేట్లు తెరిస్తే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని.. ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తే సహకరిస్తామని స్పష్టంచేశారు. కోమటిరెడ్డితో పాటు ఐదుగురు మంత్రులు బీజేపీ హైకమాండ్‌తో టచ్ లో ఉన్నారని ఆరోపించారు.
అలాగే విచారణల పేరుతో రేవంత్ రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ వసూళ్ల చిట్టా తమ వద్ద ఉందని ఆర్-ట్యాక్స్ కింద రూ.3వేల కోట్లు వసూలు చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటుకు నోటు కేసులో తన ముఖ్యమంత్రి పదవి పోతుందనే భయం రేవంత్ రెడ్డికి ఉందని విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇతర పార్టీల్లో చేరేవారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ అన్నారని.. మరి ఇప్పుడు రాజీనామా చేయకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటున్నారు? అని ఆయన ప్రశ్నించారు.
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి భూ ఆక్రమణలకు పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారని ఇప్పుడు ఆయనను కండువా కప్పి పక్కన కూర్చో పెట్టుకున్నారని విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎందుకు సీబీఐ విచారణ జరిపించడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేకే ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ ప్రజలను మభ్యపెడుతోందన్నారు. రేవంత్ తన పదవిపై అభద్రతా భావంతో ఉన్నారని.. అందుకే బీఆర్ఎస్ నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారని తెలిపారు.
కాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నిల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. తమ ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొడతాం అంటే ప్రజలు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఇదేమైనా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అనుకుంటున్నారా? అవసరమైతే బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని కోమటిరెడ్డి తెలిపారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వార్నింగ్ ఇచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout