Congress:ఈనెల 4న కేబినెట్ భేటీపై సీఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

  • IndiaGlitz, [Saturday,December 02 2023]

ఎన్నికల ఫలితాల వేళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదుచేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఇతర సీనియర్ నేతలు సీఈవోను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు.

అనంతరం వారు మాట్లాడుతూ రైతుబంధు కింద ₹6వేల కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. హైదరాబాద్‌లో అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌కు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అసైన్డ్‌ భూములను ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేయకుండా చూడాలని.. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని తెలిపారు. అలాగే ఈ నెల 4న కేసీఆర్‌ కేబినెట్‌ భేటీ ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదని.. రాజీనామాలు సమర్పించేందుకే మంత్రివర్గ సమాశేశం ఏర్పాటు చేసి ఉండొచ్చని ఎద్దేవా చేశారు. ఫలితాల రోజు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ధ్రువపత్రాలను తమ పార్టీ చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్లు తీసుకుంటారని.. ఈ మేరకు ఆర్వోలకు ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను కోరామన్నారు.

కాగా సోమవారం రాష్ట్ర సచివాలయంలో కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో మళ్లీ అధికారంపై గులాబీ బాస్ ధీమా వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చూసి నేతలు, కార్యకర్తలు హైరానా పడొద్దని.. ఫలితాలు మనకు అనుకూలంగా వస్తాయని కేసీఆర్ భరోసా ఇస్తున్నారు.