కాంగ్రెస్‌కు ఘోర పరాభవం : పంజాబ్ మిస్... యూపీలో పనిచేయని ప్రియాంక మంత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ఏలిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ గడిచిన కొన్నేళ్లుగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోన్న సంగతి తెలిసిందే. కీలక నేతలు బయటకు వెళ్లిపోవడం, అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు, నాయకత్వ లేమి వంటివి ఆ పార్టీని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఏ ఎన్నికలు తీసుకున్నా కనీస పోటీ ఇవ్వలేక చేతులెత్తేయడం కాంగ్రెస్‌కు ఆనవాయితీగా మారింది. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ హస్తం ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. కనీసం అధికారంలో వున్న పంజాబ్‌ను కూడా కాపాడుకోలేక ‘‘ఆప్’’ దూకుడుకు తలవంచింది. పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్‌కు మధ్య పొడచూపిన విభేదాలు పార్టీకి చేటు చేశాయని విశ్లేషకులు అంటున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో 117 అసెంబ్లీ స్థానాలకుగాను 77 స్థానాలు గెలిచి అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ ఈసారి డజను సీట్లు గెలువడం కూడా అనుమానమే. యూపీలోనూ 2017లో మోడీ గాలిలోనూ 7 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ఈసారి ఆ డిజిట్‌ను కూడా చేరుకునే అవకాశాలు కనిపించడంలేదు. ఉదయం 11 గంటల నాటికి కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ లీడింగ్‌లో ఉంది.
ఇక ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోనూ కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా తయారైంది. మొత్తం 60 స్థానాలకుగాను గత అసెంబ్లీ ఎన్నికల్లో 28 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ కూటమి ఇప్పుడు ఆపసోపాలు పడుతోంది. హస్తం పార్టీ కేవలం 10 స్థానాల్లో మాత్రమే ముందంజలో వుంది. గోవాలోనూ గత ఎన్నికల్లో 20 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ అలయెన్స్.. ఇప్పుడు 15 స్థానాల్లోనూ గెలిచేలా లేదు. అయితే కేవలం ఉత్తరాఖండ్ మాత్రమే కాంగ్రెస్ పరువును కాస్త నిలిపింది. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 10 స్థానాలు అదనంగా గెలువబోతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments