AP Congress:ఏపీలో మరో 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
- IndiaGlitz, [Monday,April 22 2024]
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసిన హైకమాండ్ తాజాగా మూడో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. శ్రీకాకుళం నుంచి పరమేశ్వరరావు, విజయనగరం నుంచి బొబ్బిలి శ్రీను, అమలాపురం(ఎస్సీ) నుంచి జంగా గౌతం, మచిలీపట్నం నుంచి గొల్లు కృష్ణ, విజయవాడ నుంచి వళ్లూరు భార్గవ్, ఒంగోలు నుంచి సుధాకర రెడ్డి, నంద్యాల నుంచి జంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్, అనంతపురం నుంచి మల్లికార్జున్ వజ్జల, హిందూపురం నుంచి బీఏ సమద్ షాహీన్‌కు అవకాశం ఇచ్చింది.
దీంతో ఇప్పటివరకు 126 అసెంబ్లీ స్థానాలు, 20 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించినట్లు అయింది. కాగా తొలి జాబితాలో 5 పార్లమెంటు స్థానాలు, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. రెండో జాబితాలో 6 ఎంపీ స్థానాలు, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారుచేశారు. తాజాగా 9 మంది పార్లమెంట్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. తొలి రెండు జాబితాలను పరిశీలిస్తే వైసీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కేంద్రమంత్రులకు అవకాశం ఇచ్చారు.
వీరిలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తిరిగి ఆ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి టెక్కలి నుంచి, మాజీ ఎమ్మెల్యేలు ఆమంచి శ్రీనివాస్ చీరాల నుంచి, మురళీకృష్ణ కోడుమూరు నుంచి బరిలో దిగారు. పార్లమెంట్ స్థానాలకొస్తే రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కడప పార్లమెంటు స్థానం నుంచి, కాకినాడ నుంచి కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, రాజమండ్రి నుంచి పీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, కర్నూలు నుంచి రాంపుల్లయ్య యాదవ్ బరిలోకి దిగుతున్నారు.
మరోవైపు సీపీఐతో ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది. దీంతో సీపీఐ 8 అసెంబ్లీ, ఓ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తుంది. ఇలా మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ కూటమిలో ఇప్పటివరకు 134 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. నామినేషన్లకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఈలోపు మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారా.. లేదంటే ఈ నియోజకవర్గాల వరకే బరిలో దిగుతారా అనేది తెలియాల్సి ఉం ది.