‘విక్రమ్’ ల్యాండర్ జాడపై ఏంటీ కన్ఫూజన్.. కన్ఫూజన్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2లో భాగంగా విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడిపైకి పంపగా.. అది కుప్పకూలిన విషయం విదితమే. అయితే అప్పట్నుంచి ఇప్పటి వరకూ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ల్యాండర్ జాడను శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. అయితే విక్రమ్ ల్యాండర్ జాడను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కనిపెట్టింది. ఆ ప్రాంతంలో ఇన్నాళ్లూ చీకటిగా ఉండటం, దానికి తోడు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ల్యాండర్ జాడను కనుగొనడానికి శాస్త్రవేత్తలు కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు ఆ చీకటి తొలగిపోయి ఆ ప్రాంతంలో వెలుగు రావడంతో ల్యాండర్ జాడను నాసా కనిపెట్టింది. మంగళవారం రోజున ఇందుకు సంబంధించిన ఫోటోలను నాసా రిలీజ్ చేసింది.
అబ్బే మేమే ఫస్ట్!
అయితే కనిపెట్టింది నాసా కాదని మనమేనని ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రకటించారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన నాసా ప్రకటనను తోసిపుచ్చారు. దాని జాడను తాము ఎప్పుడో కనిపెట్టామని ప్రకటించారు. ‘చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి ధ్వంసమైన విక్రం ల్యాండర్ జాడను మూడు రోజుల తర్వాత మేమే గుర్తించాం. మా సొంత ఆర్బిటర్ విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించింది. ఇందుకు సంబంధించి వివరాలు కావాలంటే ఇస్రో వెబ్ సైట్లో చూడొచ్చు’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే, నాసా ఉంచిన చిత్రాల్లో ముక్కలైన ల్యాండర్ చిత్రాలు స్పష్టంగా కనిపిస్తుండగా, ఇస్రో చిత్రాల్లో అటువంటి దేమీ లేదు. ల్యాండర్ ఢీకొట్టిన ప్రాంతాన్ని చిన్న చుక్కగా మాత్రమే చూపించడం గమనార్హం.
నాసా ఏం చెప్పింది..!?
ల్యాడర్ ఎక్కడ కూలిందో గుర్తించామని.. ల్యాండర్ నుంచి కొన్ని శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయని.. మొత్తం 24 చోట్ల ఈ శకలాలు కనిపిస్తున్నాయని నాసా మంగళవారం నాడు ఓ ప్రకటనలో తెలిపిన విషయం విదితమే. కాగా.. సుమారు ఒక కిలోమీటర్ పరిధిలో విక్రమ్ ల్యాండర్ శకలాలు ఉన్నాయని స్పష్టం చేసింది. నాసా ప్రకటనతో షార్‌లోని శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 6వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో చివరి క్షణాల్లో అది క్రాష్ ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. విక్రమ్ ఆచూకీని కనిపెట్టడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అహర్నిశలు శ్రమించి చివరికి వాటి శకలాలను గుర్తించింది.
అసలేంటి ఈ కన్ఫూజన్!?
ఓ వైపు నాసా ఏమో మేమే కనిపెట్టామని చెప్పడం.. మరోవైపు చెన్నైకి చెందిన ఓ సాధారణ ఇంజినీర్ షణ్ముగ సుబ్రమణియన్ మాత్రం నాసా కంటే ముందు కనిపెట్టాని ప్రకటించారు. అయితే తాజాగా ఇస్రో చైర్మన్ కె.శివన్ మాత్రం అబ్బే కనిపెట్టింది ఎవరో కాదు అందరికంటే ముందే మనమే కనిపెట్టామని చెబుతున్నారు. అయితే ప్రిస్టేజ్ కోసం వెళ్లి ఇలా చెబుతున్నారా..? అనేది ఇప్పటికీ అర్ధం కాని పరిస్థితి. ప్రతి ఒక్కరూ పక్కాగా ఆధారాలు చూపిస్తున్నారు కానీ.. నాసా బయటపెట్టిన తర్వాత వీరందరూ రియాక్ట్ అవుతున్నారు..? అంతకుమునుపే ఎందుకు చెప్పలేదు..? అనే ప్రశ్నకు మాత్రం ఇంతవరకూ సమాధానం రాలేదు. మరి ఎవరు ఫస్టో.. ఎవరు సెకండో.. పైనున్న ఆ పెరుమాళ్లకే ఎరుక.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments