Niharika, Chaitanya Jonnalagadda:ఔను .. వాళ్లిద్దరూ విడిపోయారు : విడాకులు కోరుతూ కోర్టులో నిహారిక పిటిషన్, పుకార్లకు చెక్

  • IndiaGlitz, [Tuesday,July 04 2023]

మెగా అభిమానులకు చేదువార్త. చిరంజీవి కుటుంబంలో మరో జంట విడాకులు తీసుకోవడానికి సిద్ధమైంది. అది ఎవరో కాదు.. మెగాస్టార్ సోదరుడు నాగబాబు గారాలపట్టి నిహారిక-చైతన్య దంపతులు. తన భర్త నుంచి తనకు విడాకులు మంజూరు చేయాల్సిందిగా నిహారిక కూకట్‌పల్లిలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హిందూ వివాహ చట్టం కింద తనకు విడాకులు మంజూరు చేయాల్సిందిగా ఆమె తన దరఖాస్తులో కోరారు. దీంతో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి నిహారిక స్వయంగా చెక్ పెట్టినట్లయ్యింది.

ఒకరి తర్వాత ఒకరు ఫోటోలు డిలీట్ చేసిన జంట :

2020 డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని జైపూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా చైతన్య - నిహారిక జంట ఒక్కటైంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా చూడముచ్చటగా వున్న ఈ స్టార్ కపుల్.. కొన్నాళ్ల పాటు హాయిగానే కాపురం చేసుకుంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో నిహారికకు సంబంధించిన ఫోటోలను చైతన్య డిలీట్ చేశారు. అప్పుడే సినీ జనాలకు, ప్రజలకు వ్యవహారం ఏదో తేడా కొట్టింది. ఆ కొన్నాళ్లకే నిహారిక కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో వున్న భర్త ఫోటోలను, వీడియోలను తొలగించింది. ఈ పరిణామంతో నిహారిక విడాకులు ఖాయమని అందరికీ అర్ధమైంది.

ఫలించని రాజీ యత్నాలు :

కొన్నినెలలుగా నిహారిక, చైతన్య విడివిడిగా వుంటున్నారు. కుటుంబ కార్యక్రమాలు, శుభకార్యాల్లోనూ వేర్వేరుగా పాల్గొంటున్నారు. అంతేకాదు.. ఇటీవల జరిగిన వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌కు కూడా నిహారిక ఒక్కరే హాజరయ్యారు. అలాగే ప్రొడక్షన్‌లోకి దిగిన నిహారిక సొంతంగా ఆఫీస్ ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమానికి చైతన్య హాజరుకాకపోగా.. కనీసం విష్ చేయలేదు. అయితే భార్యాభర్తలను కలిపేందుకు పెద్దలు ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. చివరికి నిహారిక విడాకులు కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.