కదులుతున్న బస్సులోంచి విద్యార్థినిని తోసేసిన కండక్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టూడెంట్ పాస్ చెల్లదంటూ కదులుతున్న బస్సులో నుంచి విద్యార్థినిని కండక్టర్ కిందికి తోసేశాడు. ఈ ఘటనలో విద్యార్థినికి తలకు తీవ్ర గాయమవ్వగా.. పళ్లు ఊడిపోయాయి.. ఈ అమానుష ఘటన మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఈ నెల 11న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకెళితే.. కర్ణాటకలోని కనకపుర టౌన్‌కు చెందిన భూూమిక అనే విద్యార్థిని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజు మాదిరిగానే గత సోమవారం బస్సు ఎక్కింది. కండక్టర్ టికెట్ అడగ్గా.. తనకు బస్ పాస్ ఉంది సార్.. అక్కర్లేదని చెప్పింది. అయితే బస్‌పాస్ చెల్లదని కండక్టర్.. ఎందుకు చెల్లదని స్టూడెంట్ ఇలా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన కండక్టర్ బెదిరించసాగాడు. దీంతో భూమిక చేసేదేమీ లేక సరే సార్.. వచ్చే స్టాప్‌లో దిగుతానని బతిమలాడి మరీ చెప్పింది. ఆమె నెత్తి నోరు కొట్టుకుని బతిమలాడుతున్నా కండక్టర్ మాత్రం అస్సలు వినిపించుకోలేదు.
అంతేకాదు.. బస్సు దిగుతావా లేకుంటే కిందికి తోసేయ్యాలా అంటూ అన్నంత పని చేసేశాడు. కదులుతున్న బస్సులో నుంచి ఆ విద్యార్థినిని తోసేశాడు. ఈ ఘటనలో ఆ విద్యార్థినికి తీవ్ర గాయాలవ్వగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తలకు తీవ్ర గాయం అయ్యిందని.. పళ్లు ఊడాయని.. ముక్కుకు కూడా గాయమైందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా బస్సును కేఏ 42ఎఫ్ 2217 నంబరుగా గుర్తించారు. కండక్టర్‌ను హారోహళ్లి డిపోకి చెందిన శివశంకర్‌గా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే.. కొందరు బస్సు కండక్టర్లు కమిషన్ల కోసం కక్కుర్తి పడి బస్ పాస్‌లు నిరాకరిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇలాంటి విషయాలపై ప్రభుత్వం దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments