Vijayasai Reddy: ఏపీ, తెలంగాణ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి: విజయసాయి రెడ్డి
- IndiaGlitz, [Tuesday,January 09 2024]
ఏపీతో పాటు తెలంగాణ లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల బృందాన్ని అభ్యర్థించారు. విజయవాడలో సీఈసీ బృందం రాజకీయల పార్టీల నేతలో సమావేశమైంది. ఈ సందర్భంగా వైసీపీ తరపున వారిని కలిసిన విజయసాయిరెడ్డి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే దొంగ ఓట్లను నిలువరించవొచ్చని సీఈసీకి తెలియజేశామన్నారు. తెలంగాణలో ఓటర్లుగా నమోదైన వారంతా ఏపీలో కూడా ఓటు నమోదు చేసుకున్నారని.. రెండు చోట్ల ఓటు వేయకుండా నిరోధించాలని కోరామని తెలిపారు.
అలాగే గుర్తింపు లేని జనసేన పార్టీని మీటింగ్‌కు ఎలా అనుమతించారనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. జనసేనను ఇప్పటివరకు బీజేపీ భాగస్వామ్య పార్టీగా పరిగణిస్తూ వచ్చారని.. కానీ ఎన్నికల సంఘానికి ఇచ్చిన అభ్యర్థనలో జనసేన పార్టీని టీడీపీ భాగస్వామ్య పార్టీ అని ఎలా తెలుపుతారని ప్రశ్నించామన్నారు. జనసేన పార్టీ అసలు బీజేపీ భాగస్వామ్య పక్షమా.. టీడీపీ భాగస్వామ్య పక్షమా అనేది తెలియడం లేదన్నారు. అలాంటి పార్టీని అనుమతించం సమంజసమేనా అనే విషయాన్ని సీఈసీ ఎదుట ప్రస్తావించామని ఆయన చెప్పుకొచ్చారు.
జనసేన అనేది ఒక గుర్తింపులేని రాజకీయ పార్టీ అని.. గ్లాసు గుర్తు అనేది జనరల్ సింబల్ అన్నారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో కేవలం కొన్ని స్థానాల్లోనే పోటీ చేసే ఒక పార్టీకి సాధారణ గుర్తుల్లోంచి ఒక సింబల్ కేటాయించడం చట్ట విరుద్ధమని కూడా వివరించామని విజయసాయి రెడ్డి వెల్లడించారు. తక్షణమే జనసేనకు గాజు గ్లాస్ గుర్తు ఇవ్వకుండా చూడాలని కోరినట్లు ఆయన చెప్పారు.
కాగా అంతకుముందు కేంద్ర ఎన్నికల అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాల్లో నమోదవుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వాలంటీర్లతో పాటు సచివాలయ సిబ్బంది ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలిని వారు ఈసీ బృందాన్ని కోరారు.